Mango Capital Of The World: ప్రపంచ మామిడి రాజధానిగా పేరుగాంచిన నగరం ఏది?
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి వచ్చిందంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లే. జ్యూసులు, షేక్స్, ఐస్‌క్రీమ్స్, స్వీట్స్ నుంచి నేరుగా పండునే తినేవరకు మామిడి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. "పండ్ల రాజు"గా పిలిచే మామిడి భారతీయుల ఆహార సంస్కృతిలో ఎంతో కీలకంగా మారింది. ప్రపంచంలోని అనేక ఉష్ణ మండల దేశాల్లో మామిడి పండించినా.. ఒక ప్రాంతం మాత్రం తన ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అదే ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలీహాబాద్. అందుకే దీనిని ప్రపంచ మామిడి రాజధాని అని పిలుస్తుంటారు.
వివరాలు
మలీహాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
లక్నో సమీపంలో ఉన్న చిన్న పట్టణం మలీహాబాద్..మామిడి తోటలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఇక్కడ పండే దసేరీ మామిడి రకం దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. తియ్యటి రుచి, అద్భుతమైన వాసన,మెత్తటి గుజ్జుతో దసేరీ మామిడి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. నవాబుల కాలం నుంచే ఇక్కడ మామిడి సాగు జరుగుతోందని చెబుతారు. ప్రస్తుతం వేల ఎకరాల్లో విస్తరించిన మామిడి తోటలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ పండే ప్రముఖ మామిడి రకాలు మలీహాబాద్‌లో పండే మామిడి రకాలలో దసేరీ,లంగ్రా,చౌసా,సఫేదా,అమ్రపాలి వంటి రకాలు ప్రముఖమైనవి. సారవంతమైన నేల,అనుకూల వాతావరణం వల్ల ఇక్కడ అత్యుత్తమ నాణ్యత కలిగిన మామిడిపండ్లు పండుతాయి. అందుకే ఈ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది.
వివరాలు
మలీహాబాద్ మామిడికి ఎందుకింత డిమాండ్?
మలీహాబాద్‌లో పండే మామిడిపండ్లకు ప్రత్యేక రుచి ఉంటుంది. తియ్యదనం, మత్తెక్కించే వాసన, జ్యూసీ టెక్స్చర్, తక్కువ ఫైబర్‌తో ఉండే గుజ్జు వీటి ప్రత్యేకత. ముఖ్యంగా దసేరీ మామిడి ఇక్కడి స్టార్ ఆకర్షణగా చెప్పొచ్చు. దసేరీ రకానికి చెందిన అసలు "మదర్ ట్రీ" ఇప్పటికీ మలీహాబాద్‌లో ఉందని చెబుతారు. అది 200 ఏళ్లకు పైగా పాతదిగా భావిస్తున్నారు. దేశ విదేశాలకు ఎగుమతులు మలీహాబాద్ మామిడిపండ్లు దేశంలోని అనేక రాష్ట్రాలకు సరఫరా అవుతాయి. అంతేకాదు విదేశాలకు కూడా భారీగా ఎగుమతి చేస్తుంటారు. దీంతో ప్రపంచ మామిడి మార్కెట్‌లో ఈ ప్రాంతం కీలక స్థానాన్ని సంపాదించింది.
వివరాలు
మామిడితో ముడిపడ్డ సంస్కృతి
మలీహాబాద్ ప్రజల జీవన విధానంలో మామిడి ఒక భాగంగా మారిపోయింది. తరతరాలుగా రైతు కుటుంబాలు మామిడి సాగు చేస్తూ వస్తున్నాయి. వేసవి కాలంలో ఇక్కడ మామిడి మార్కెట్లు సందడిగా మారుతాయి. దేశం నలుమూలల నుంచి వ్యాపారులు ఇక్కడికి చేరుకుంటారు. మామిడి పండ్ల సువాసనతో మొత్తం ప్రాంతం కళకళలాడిపోతుంది. ప్రపంచ మామిడి రాజధానిగా గుర్తింపు భారత్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, మెక్సికో వంటి దేశాలు మామిడి ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందినా.. మలీహాబాద్ మాత్రం తన చరిత్ర, విస్తృత సాగు, దసేరీ మామిడి ఖ్యాతితో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. అధికారిక గుర్తింపు కాకపోయినా.. "ప్రపంచ మామిడి రాజధాని"గా మలీహాబాద్‌కు విశేష గుర్తింపు ఉంది.