LOADING...
Spreuerhofstrasse : ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి.. ఇది.. ఎక్కడుందంటే?
ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి.. ఇది.. ఎక్కడుందంటే?

Spreuerhofstrasse : ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి.. ఇది.. ఎక్కడుందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

నగరాలంటే విస్తారమైన రహదారులు, ఎత్తైన భవనాలే మనకు గుర్తుకొస్తాయి. కానీ కొన్ని నగరాల్లో ఊహించని వింతలు కూడా దాగి ఉంటాయి. అలాంటి వాటిలో ప్రపంచంలోనే అతి ఇరుకైన వీధి ఒకటి. ఇది చూసేందుకు రెండు భవనాల మధ్య ఉన్న చిన్న సందులా కనిపించినప్పటికీ, అధికారికంగా వీధిగా గుర్తింపు పొందింది. అంతేకాదు, తన ప్రత్యేకతతో ప్రపంచ రికార్డుల్లో కూడా చోటు సంపాదించి, పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే అతి ఇరుకైన వీధిగా పేరొందిన స్ప్రూయర్‌హాఫ్‌స్ట్రాస్సే జర్మనీ దేశంలోని రూట్‌లింగెన్ నగరంలో ఉంది. ఈ వీధి అత్యంత ఇరుకైన చోట కేవలం 31 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది.

వివరాలు 

1726లో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత ఏర్పడిన ఈ సందు నేడు ప్రముఖ పర్యాటక కేంద్రం

కొంచెం వెడల్పు ఉన్న ప్రదేశాల్లో కూడా ఇది 50సెంటీమీటర్లను మించదు. అందువల్ల ఒకేసారి ఒక్క వ్యక్తి మాత్రమే ఇందులో నడవగలడు. అదీ నిటారుగా కాదు,పక్కకు తిరిగి నెమ్మదిగా కదలాల్సి ఉంటుంది. కాస్త లావుగా ఉన్నవారు లేదా పెద్ద సంచులు మోసేవారికి ఈ మార్గం దాదాపు అసాధ్యమే. కనిపించేది సందులా ఉన్నప్పటికీ, దీనికి ప్రజా వీధి అనే అధికారిక గుర్తింపు ఉంది. ఈ వీధి వెనుక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. 1726లో ఈ నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంతో చాలా భాగం నాశనమైంది. ఆ తర్వాత పునర్నిర్మాణ సమయంలో రెండు భవనాల మధ్య అనుకోకుండా చిన్న ఖాళీ మిగిలింది. కాలక్రమంలో అదే సందు వీధిగా మారింది.1820లో దీనికి అధికారికంగా వీధి సంఖ్యను కేటాయించారు.

వివరాలు 

దీనిని చూసేందుకు, ఇందులో నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్న పర్యాటకులు

అయితే ఈ ఇరుకైన నిర్మాణం వల్ల భవనాల నిర్వహణ,హక్కుల విషయంలో యజమానుల మధ్య అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ వింత వీధి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడికి రావడం అంటే కేవలం ఒక ప్రదేశాన్ని చూడడం కాదు,ప్రత్యేక అనుభూతిని ఆస్వాదించడం. ఈ వీధిలో నడవగలమా లేదా అని ప్రయత్నించడం, దాని ఇరుకుదనాన్ని చిత్రాల్లో బంధించడం పర్యాటకులకు ఆసక్తికరంగా మారింది. స్థానిక మార్గదర్శక పర్యటనల్లో కూడా దీనిని ముఖ్య ప్రదేశంగా చేర్చడం వల్ల సందర్శకులు సులభంగా చేరుకుంటున్నారు. ఇలాంటి ఇరుకైన వీధులు ప్రపంచంలో మరికొన్ని ఉన్నప్పటికీ, స్ప్రూయర్‌హాఫ్‌స్ట్రాస్సే మాత్రం ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. చిన్న సందు కూడా తనకంటూ కథను కలిగి ప్రపంచ ప్రఖ్యాతి పొందగలదని ఇది నిరూపిస్తోంది.

Advertisement