LOADING...
Lifestyle Managers: ఏడాదికి రూ.1.3 కోట్లు ఖర్చు.. ధనవంతుల కోసం 24 గంటల సేవలు అందించే 'లైఫ్‌స్టైల్ మేనేజర్లు' ఎవరు?
టూర్ నుంచి పార్టీ వరకు అన్నీ వాళ్లే.. ఎవరి లైఫ్‌స్టైల్ మేనేజర్లు ఎవరు?

Lifestyle Managers: ఏడాదికి రూ.1.3 కోట్లు ఖర్చు.. ధనవంతుల కోసం 24 గంటల సేవలు అందించే 'లైఫ్‌స్టైల్ మేనేజర్లు' ఎవరు?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల కుటుంబాల్లో ఓ కొత్త ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పనులన్నింటినీ చూసుకునేందుకు 'లైఫ్‌స్టైల్ మేనేజర్లు' అనే ప్రత్యేక నిపుణుల సేవలను ఆశ్రయిస్తున్నారు. విదేశీ పర్యటనల ప్రణాళికలు, ప్రైవేట్ పార్టీల నిర్వహణ, యాచ్‌లు, ప్రైవేట్ జెట్‌ల ఏర్పాట్లు, ప్రయాణాల్లో ఎదురయ్యే అత్యవసర సమస్యల పరిష్కారం వరకు వీరే బాధ్యత తీసుకుంటున్నారు.

వివరాలు 

ఏడాదికి రూ.1.3 కోట్ల వరకు ఫీజు

న్యూయార్క్, ఆస్పెన్ కేంద్రంగా పనిచేస్తున్న'రోమన్ అండ్ ఎరికా' అనే లైఫ్‌స్టైల్ మేనేజ్‌మెంట్ సంస్థ ఈ రంగాన్ని మరోసారి చర్చనీయాంశంగా మార్చింది. ఈ సంస్థ సేవలను పొందేందుకు కొందరు ఖాతాదారులు ఏడాదికి 1.5లక్షల డాలర్లకు పైగా,అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1.3కోట్లు చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. ఈ మొత్తానికి సంస్థ వ్యవస్థాపకుల సేవలు 24గంటలూ అందుబాటులో ఉంటాయి. ట్రావెల్ ఏజెంట్లు కాదు.. వ్యక్తిగత జీవిత నిర్వాహకులు సాధారణ ట్రావెల్ ఏజెంట్లు లేదా వ్యక్తిగత సహాయకులతో పోలిస్తే లైఫ్‌స్టైల్ మేనేజర్ల బాధ్యతలు చాలా భిన్నంగా ఉంటాయి. విదేశీ విహారయాత్రలు ప్లాన్ చేయడం,ప్రైవేట్ విమానాలు, యాచ్‌ల నిర్వహణ, కుటుంబ వేడుకలు, ప్రముఖ రెస్టారెంట్లలో బుకింగ్స్, ప్రయాణాల్లో ఎదురయ్యే అనుకోని సమస్యలను పరిష్కరించడం వంటి ఎన్నో పనులను వీరే నిర్వహిస్తారు.

వివరాలు 

విహారయాత్రల నుంచి కుటుంబ వేడుకల వరకు

సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఎరికా జాకోవిట్జ్ ప్రకారం.. ఖాతాదారుల విశ్రాంతి, వినోదానికి సంబంధించిన ప్రతి అంశాన్ని తమ బృందం చూసుకుంటుంది. పిల్లల క్రీడా పర్యటనలు, ప్రైవేట్ డిన్నర్ పార్టీలు, విదేశీ సాహస యాత్రలు,భారీ సామాజిక వేడుకలు వంటి కార్యక్రమాలన్నీ ఇందులో భాగమే. "వారి విశ్రాంతి జీవితానికి సంబంధించిన ఏ పని అయినా మేమే చూసుకుంటాం" అని ఆమె తెలిపారు. ఖాతాదారులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుందని చెప్పారు.

Advertisement

వివరాలు 

ఎంపిక చేసిన 10-12 కుటుంబాలకే ప్రత్యేక సేవలు

వ్యక్తిగత సేవలకు ప్రాధాన్యం ఇవ్వడానికి ఈ సంస్థ ఒకేసారి కేవలం 10 నుంచి 12 కుటుంబాలకే సేవలు అందిస్తోంది. దీంతో ప్రతి కుటుంబానికి ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు అర్ధరాత్రి వచ్చిన అత్యవసర అభ్యర్థనలకు కూడా వెంటనే స్పందించే అవకాశం ఉంటుందని ఎరికా వెల్లడించారు. లైఫ్‌స్టైల్ మేనేజర్లు తమ ఖాతాదారుల ఇష్టాలు, అలవాట్లను పూర్తిగా తెలుసుకుంటారు. వారికి ఇష్టమైన రెస్టారెంట్లు, బహుమతులు, వేడుకల తీరు, ప్రయాణ అలవాట్లు వంటి వివరాలను గుర్తుంచుకుని పెద్దగా సంప్రదింపులు అవసరం లేకుండానే ఏర్పాట్లు చేస్తుంటారు.

Advertisement

వివరాలు 

సమయాన్ని ఆదా చేయడమే ప్రధాన లక్ష్యం

కొత్త ప్రదేశాలపై సమాచారం సేకరించడం, టికెట్లు బుక్ చేయడం,విదేశాల్లో మంచి రెస్టారెంట్లు వెతకడం వంటి పనుల కోసం గంటల సమయం వెచ్చించాల్సిన అవసరం లేకుండా చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఎరికా తెలిపారు. అన్ని ఏర్పాట్లను నిపుణులే చూసుకోవడంతో ఖాతాదారులు తమ విలువైన సమయాన్ని ఇతర పనులకు వినియోగించుకోవచ్చు. లైఫ్‌స్టైల్ మేనేజర్ల పని సాధారణ ఏర్పాట్లకే పరిమితం కాదు. క్రీడా పోటీలకు అనుగుణంగా ప్రయాణ షెడ్యూళ్లను మార్చడం, విమానాల రద్దు వల్ల అంతర్జాతీయ ప్రయాణాలను తిరిగి ప్లాన్ చేయడం, నెలల ముందుగానే భారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడం వంటి పనులు కూడా వీరే నిర్వహిస్తుంటారు.

వివరాలు 

యాచ్ నుంచి హెలికాప్టర్ ద్వారా రక్షణ!

ఎరికా జాకోవిట్జ్ చెప్పిన ఓ ఆసక్తికర సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇటలీలోని కాప్రిలో ఓ కార్యక్రమంలో ఉండగా, మధ్యధరా సముద్రంలోని యాచ్(ప్రైవేట్ విలాస నౌక)లో ఉన్న తమ స్నేహితులను వెంటనే బయటకు తీసుకురావాలని ఓ ఖాతాదారు కోరారు. వెంటనే హెలికాప్టర్ ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా తరలించినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటనను సంస్థలో 'రెస్క్యూ మిషన్'గా పిలుస్తారట. చివరి నిమిషంలో ప్రముఖ రెస్టారెంట్లలో టేబుల్ బుకింగ్ చేయడం నుంచి కుటుంబ వేడుకల కోసం వాటర్ గేమ్స్, పిల్లల ఆట స్థలాలు, అనేక ఆహార స్టాళ్లతో భారీ ప్రైవేట్ కార్నివాల్‌లను ఏర్పాటు చేయడం వరకు వీరి సేవలు విస్తరించి ఉంటాయి.

వివరాలు 

న్యాయవాది నుంచి లైఫ్‌స్టైల్ మేనేజర్‌గా

ఎరికా జాకోవిట్జ్ వృత్తిరీత్యా న్యాయవాది. క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంపై ఉన్న ఆసక్తే తనను ఈ రంగంలోకి తీసుకొచ్చిందని ఆమె తెలిపారు. ఇతరులు అసాధ్యమని భావించిన పనులను పూర్తి చేయడమే తనకు ఇష్టమని చెప్పారు. ఈ వృత్తిలో ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య స్పష్టమైన సరిహద్దులు ఉండవని ఎరికా చెబుతున్నారు. వేసవిలో తమ ఖాతాదారులు ఎక్కువగా యూరప్‌లో ఉండటంతో, తాను కూడా భర్తతో కలిసి అక్కడే ఎక్కువ కాలం గడుపుతానని తెలిపారు. హోటళ్లు, బీచ్ ప్రాంతాల నుంచే పని చేస్తూ ఖాతాదారులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు.

వివరాలు 

సంపదతో పాటు సమయాన్నీ ఆదా చేసే ప్రత్యేక సర్వీస్ 

ధనవంతుల కుటుంబాల్లో ఇప్పుడు సంపదను కాపాడుకోవడమే కాదు.. సమయాన్ని ఆదా చేసుకోవడానికీ ఇలాంటి ప్రత్యేక సర్వీస్'లకు డిమాండ్ పెరుగుతోంది. రోజువారీ జీవితంలోని చిన్నా పెద్దా బాధ్యతలను నిపుణులకు అప్పగించి, తమ విలువైన సమయాన్ని కుటుంబం, వ్యాపారం, వ్యక్తిగత ఆసక్తుల కోసం వినియోగించుకోవాలనే ధోరణి ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది.

Advertisement