Goa Liberation : ఆగస్టు 15న గోవాకు స్వాతంత్య్రం ఎందుకు రాలేదు? 36 గంటల 'ఆపరేషన్ విజయ్' కథ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందింది. దేశంలోని అత్యధిక ప్రాంతాలు స్వతంత్ర భారతదేశంలో భాగమయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాలు మాత్రం ఆ రోజునే స్వాతంత్ర్యాన్ని పొందలేదు. వాటిలో గోవా కూడా ఒకటి. అయితే గోవా అప్పటికి బ్రిటిష్ పాలనలో కాకుండా 'పోర్చుగీసు పాలనలో' ఉండేది. పోర్చుగీసులు 1510 నుంచి గోవాపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గోవాను దేశంలో విలీనం చేసేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు జరిగాయి. కానీ పోర్చుగల్ గోవాపై తన నియంత్రణను వదులుకునేందుకు అంగీకరించలేదు. దీంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ గోవా మాత్రం మరో 14 ఏళ్ల పాటు పోర్చుగీసుల పాలనలోనే కొనసాగింది.
వివరాలు
'ఆపరేషన్ విజయ్'తో విముక్తి
1961డిసెంబర్‌లో గోవా విషయంలో పరిస్థితులు కీలక మలుపు తిరిగాయి. పోర్చుగల్ నుంచి గోవాను విముక్తి చేసేందుకు భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ విజయ్' పేరుతో సైనిక చర్య చేపట్టాయి.
1961 డిసెంబర్ 17న ప్రారంభమైన ఈ ఆపరేషన్ భూ, వాయు, సముద్ర మార్గాల్లో కొనసాగింది. 36 గంటలకు పైగా సాగిన ఈ సైనిక చర్య డిసెంబర్ 19న ముగిసింది.
పోర్చుగీసు గవర్నర్ 'మాన్యుయెల్ ఆంటోనియో వస్సాలో ఇ సిల్వా' లొంగిపోవడంతో పోర్చుగీసు పాలనకు తెరపడింది. దీంతో 1961డిసెంబర్ 19న గోవా అధికారికంగా భారతదేశంలో భాగమైంది.
అప్పటి నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 19న గోవా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజుతో భారత భూభాగంలో కొనసాగుతున్న పోర్చుగీసు పాలనకు పూర్తిగా ముగింపు పలికింది.
వివరాలు
కేంద్ర పాలిత ప్రాంతం నుంచి రాష్ట్రంగా..
గోవా, దమన్, దీవ్ ప్రాంతాలను కలిపి తొలుత కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. అనంతరం '1967లో ప్రజాభిప్రాయ సేకరణ' నిర్వహించారు.
గోవా మహారాష్ట్రలో విలీనం కావాలా? లేక కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగాలా? అనే అంశంపై ప్రజలు ఓటు వేశారు.
మెజారిటీ ప్రజలు కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగేందుకు మొగ్గుచూపారు. ఆ తర్వాత 1987 మే 30న గోవాకు రాష్ట్ర హోదా లభించింది.
దీంతో గోవా భారతదేశంలోని 25వ రాష్ట్రంగా అవతరించింది.
ఇలా 1947లో దేశంలోని మిగతా ప్రాంతాలకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ.. గోవా మాత్రం 1961లో 'ఆపరేషన్ విజయ్' అనంతరం భారతదేశంలో పూర్తిస్థాయిలో విలీనమైంది.