Christmas 2024: క్రిస్‌మస్ రోజు ఎరుపు రంగు సాక్సులు, దుస్తులు ఎందుకు వేసుకుంటారు? ఎరుపు రంగుకు క్రిస్‌మస్ కి సంబంధం ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను ఎంతో ఉత్సాహంగా, ఆనందంతో జరుపుకుంటారు. క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తుంటారు, ఎందుకంటే ఇది జీసస్ క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ప్రత్యేక దినం. ఈ పండుగ సందర్భంగా ఇళ్లు, చర్చిలు విద్యుద్దీపాలతో వెలుగులు నింపుకుంటాయి. కుటుంబసభ్యులు, స్నేహితులు, సహచరులకు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, క్రిస్మస్ ట్రీలను అలంకరించడం వంటి ఆనందకరమైన కార్యక్రమాలు ఉంటాయి. పచ్చని క్రిస్మస్ చెట్టు శాశ్వత జీవితానికి చిహ్నంగా నిలుస్తుందని భావిస్తారు. అదనంగా, అందమైన కరోల్స్ పాడటం కూడా ఈ పండుగకు ప్రత్యేకతను జోడిస్తుంది.
శాంటాక్లాజ్ బహుమతుల కోసం ఎదురుచూపులు
క్రిస్మస్ పేరు వింటే మత భేదాలేని పిల్లలందరి ముఖాల్లో ఆనందం వెలుగులు నింపుతుంది. పిల్లలు తమ ప్రియమైన శాంటాక్లాజ్ బహుమతులు అందిస్తాడని ఎదురుచూస్తారు. ఎరుపు రంగు దుస్తులు ధరించిన శాంటా, ఎరుపు రంగు సాక్స్‌లో బహుమతులు దాచి అందిస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. అయితే, ఎరుపు రంగు క్రిస్మస్ పండుగకు ఎందుకు ప్రధానంగా కనిపిస్తుందో తెలుసుకోవడం ఆసక్తికరం. ఈ సంప్రదాయం టర్కీ నుండి, నాల్గవ శతాబ్దంలో ప్రారంభమైంది. మైరాలో నివసించిన సెయింట్ నికోలస్ అనే ధనవంతుడు తన దయా గుణంతో పేదవారికి సహాయం చేసేవాడు.
ఎరుపు దుస్తులుపై ప్రసిద్ధి చెందిన కథ
రహస్యంగా, ఎరుపు దుస్తులు ధరించి, ఎరుపు సాక్స్‌లో డబ్బు పెట్టి పేదవారి ఇళ్లలో చిమ్నీ ద్వారా వేసిన కథ ప్రసిద్ధి పొందింది. నికోలస్ చేసిన ఈ పనులు పట్టణమంతా వ్యాపించి, క్రిస్మస్ రోజున శాంటాక్లాజ్ వచ్చి, ఎరుపు సాక్స్‌లో బహుమతులు అందిస్తాడనే నమ్మకంగా మారింది. ఈ కారణంగానే క్రిస్మస్ పండుగకు ఎరుపు రంగు ముఖ్యమైన భాగమైంది. ప్రస్తుతం, క్రిస్మస్ అంటేనే ఎరుపు రంగు దుస్తులు, అలంకరణలతో మిళితమై ఉందని చెప్పవచ్చు.