Christmas Gifts: బహుమతుల మార్పిడి ఎందుకు? క్రిస్మస్ కానుకల వెనుక ఉన్న అసలు అర్థం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ వేడుకల్లో ముఖ్యమైన సంప్రదాయం క్రిస్మస్ కానుకల మార్పిడి. క్రిస్మస్ శుభదినాన ఒకరికి ఒకరు బహుమానాలు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ బహుమానాల వెనుక దాగి ఉన్న అసలు అర్థం, ఆధ్యాత్మిక రహస్యం ఏమిటన్న విషయాన్ని హనుమకొండ సెంటెనరీ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ రంజిత్ వివరించారు. బైబిల్ ప్రకారం, క్రీస్తు ప్రభువు పుట్టుకనే ఈ సంప్రదాయానికి మూలంగా చూడవచ్చని ఆయన తెలిపారు. సర్వ మానవాళి రక్షణ కోసం దేవుడు తన అద్వితీయ కుమారుడైన ఏసుక్రీస్తును ఈ లోకానికి ఒక గొప్ప బహుమానంగా పంపించాడని వివరించారు. మానవులు పాపాల నుంచి విమోచన పొందాలనే ఉద్దేశంతోనే క్రీస్తు అవతరించారని ఆయన పేర్కొన్నారు.
Details
అవసరమైన వారికి సాయంగా బహుమానాలు
ఏసుక్రీస్తు ఇజ్రాయెల్ దేశంలోని బేత్లహేము గ్రామంలో జన్మించారు. ఆయన జన్మించిన సందర్భంలో తూర్పు దేశాల నుంచి వచ్చిన జ్ఞానులు ఒక నక్షత్రాన్ని గమనించి దానిని అనుసరిస్తూ పశువుల పాకలో ఉన్న శిశు యేసును దర్శించారు. ఆ సమయంలో వారు తమతో తెచ్చుకున్న బంగారం, సాంబ్రాణి, బోళమును ఏసుక్రీస్తుకు బహుమానాలుగా సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ సంఘటననే క్రిస్మస్ సందర్భంగా బహుమానాలు ఇచ్చే సంప్రదాయానికి ఆధారంగా భావిస్తారు. అదే విధంగా నేటి రోజుల్లోనూ చాలామంది పేదలకు, అవసరమైన వారికి సహాయంగా బహుమానాలు ఇస్తుంటారని ఓ ప్రముఖ పాస్టర్ తెలిపారు. ఆ నక్షత్రం చేసిన మార్గదర్శక సహాయాన్ని గుర్తు చేసుకుంటూ క్రిస్మస్ సమయాల్లో క్రైస్తవులు తమ ఇళ్లపై నక్షత్రాన్ని అలంకరణగా ఉంచుతారు.
Details
వలం ఆచారం కాదు.. ఆనవాయితీ మాత్రమే
ఇక పాపం అంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమేనని, ఆ ఆజ్ఞలను ఉల్లంఘించకుండా, మానవులు చేసిన తప్పుల నుంచి విముక్తి కలిగించేందుకే ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని ఆయన వివరించారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రిస్మస్ పండుగను విశేషంగా జరుపుకుంటారని చెప్పారు. ఈ బహుమానాల వెనుక ఉన్న అసలు శ్రేష్ఠమైన సారాంశం ఏమిటంటే - ఇవి కేవలం ఆచారం కాదు, అలవాటు కాదు, ఆనవాయితీ మాత్రమే కాదు. మానవ రక్షణ కోసం క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆ దేవుడు ఆయన్ని మనకు ఒక అమూల్యమైన బహుమానంగా ఇచ్చాడు.
Details
పేదలకు సహాయాన్ని అందించాలి
కనుక ఆ బహుమానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని ఓ ప్రముఖ పాస్టర్ సూచించారు. క్రిస్మస్ కానుకలను కేవలం సంప్రదాయంగా చూడకుండా, నిజమైన ప్రేమతో, కార్యరూపంలో చూపించాలని అన్నారు. మాటలకన్నా సాయం చేయడం గొప్పదని గుర్తు చేస్తూ, క్రిస్మస్ రోజున పిల్లలకు బహుమతులు ఇవ్వడమే కాకుండా పేదలకు, అవసరమైన వారికి సహాయాన్ని అందించడం ద్వారానే ఈ పండుగ అసలు అర్థం సార్థకమవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు