LOADING...
Holi 2026: హోలీకా దహనం ఎందుకు చేస్తారు? పురాణాల్లోని అసలు కారణాలు ఇవే!
హోలీకా దహనం ఎందుకు చేస్తారు? పురాణాల్లోని అసలు కారణాలు ఇవే!

Holi 2026: హోలీకా దహనం ఎందుకు చేస్తారు? పురాణాల్లోని అసలు కారణాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2026
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిందూ పంచాంగం ప్రకారం ప్రతేడాది ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. ఈసారి మార్చి 14, శుక్రవారం రంగుల హోలీని నిర్వహించనున్నారు. ఈ పండుగను హిందువులతో పాటు ఇతర మతాల వారు కూడా ఆనందంగా జరుపుకుంటారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ రంగుల వర్షంలో తడిసి ముద్దవుతూ సంబరాల్లో మునిగిపోతారు. సత్యయుగం నుంచే హోలీ ఆనవాయితీ కొనసాగుతోందని పురాణాలు వివరిస్తాయి. అందుకే ఇది అత్యంత ప్రాచీనమైన పండుగలలో ఒకటిగా భావిస్తారు. 'హోలీ' అనే పదానికి అగ్నితో సంబంధమున్న అర్థం ఉంది. దీనిని 'హోలికా పూర్ణిమ' అని కూడా పిలుస్తారు.

Details

వసంత పంచమి నుంచే హోలీ సంబరాలు

ఈ సందర్భంగా కాముని దహనం, డోలికోత్సవం వంటి వేడుకలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బర్సానా, నంద గ్రామ పరిసరాల్లో వసంత పంచమి నుంచే హోలీ సంబరాలు ప్రారంభమవుతాయి. దాదాపు 40 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచాయి. విదేశాల నుంచి కూడా వేలాదిమంది పర్యాటకులు అక్కడి వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వస్తుంటారు. ఇప్పుడు హోలీ వెనుక ఉన్న పురాణ కథలు, ఈ రంగుల పండుగ ఆవిర్భావానికి కారణమైన విశేషాలు తెలుసుకుందాం.

Details

శ్రీహరి మహిమతో ప్రహ్లాదుడి రక్షణ

ఒక పురాణ గాథ ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశ్యపుడు తన తమ్ముడు శ్రీహరి చేతిలో మరణించడంతో ప్రతీకారం తీర్చుకోవాలనే సంకల్పంతో ఘోర తపస్సు చేస్తాడు. వరప్రాప్తి తరువాత తానే దేవుడినని ప్రకటించి ప్రజలందరూ తననే ఆరాధించాలని ఆజ్ఞాపిస్తాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం మహావిష్ణువుపై అపార భక్తి కలవాడు. తండ్రి హెచ్చరికలను పట్టించుకోకుండా ఎల్లప్పుడూ శ్రీహరినే స్మరిస్తాడు. దీనికి ఆగ్రహించిన హిరణ్యకశ్యపుడు తన స్వంత కుమారుడినే సంహరించాలని ప్రయత్నిస్తాడు.

Advertisement

Details

హోలిక మాత్రం అగ్నిలో దహనమై బూడిదవుతుంది

హిరణ్యకశ్యపుడు ఆదేశంతో అగ్నికి అతీతమైన వరం పొందిన తన సోదరి హోలిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలోకి దిగుతుంది. . అయితే విష్ణు నామస్మరణలో లీనమైన ప్రహ్లాదుడికి ఎలాంటి హాని కలగదు. హోలిక మాత్రం అగ్నిలో దహనమై బూడిదవుతుంది. చెడుపై మంచికి లభించిన విజయానికి గుర్తుగా హోలికా దహనం నిర్వహించే ఆనవాయితీ ఏర్పడింది. అనంతరం హిరణ్యకశ్యపుడిని కూడా శ్రీహరి సంహరిస్తాడు. అందువల్ల హోలీ పండుగకు హోలికా దహన గాథ ప్రధాన ఆధారం

Advertisement

Details

డోలికోత్సవం - కృష్ణలీలల జ్ఞాపకం

మరో కథనం ప్రకారం శ్రీకృష్ణుడు బృందావనంలో గోపికలతో కలిసి పూలు, రంగులతో ఆడుతూ ఈ ఉత్సవాన్ని జరుపుకున్నాడని చెబుతారు. ఒకరిపై ఒకరు రంగులు, పువ్వులు చల్లుకోవడం స్నేహం, ప్రేమ, సౌభాగ్యాలను పెంచుతుందనే నమ్మకం ఉంది. ఈ వేడుకనే డోలోత్సవం లేదా డోలికోత్సవం అంటారు. 'డోలిక' అంటే ఊయల అని అర్థం. ఫాల్గుణ పౌర్ణమి రోజున చిన్న కృష్ణుడిని ఊయలలో ఊపినట్లు పురాణాల్లో వర్ణించారు. అందుకే పశ్చిమ బెంగాల్‌లో హోలీ సందర్భంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో ఉంచి ప్రత్యేక డోలికోత్సవం నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కన్నయ్య రాధను ఊయలలో కూర్చోబెట్టి రంగులు చల్లినట్లు కూడా విశ్వసిస్తారు.

Details

ఫాల్గుణ పౌర్ణిమ - హోలిక పూజ ఆరంభం

కృతయుగంలో సూర్యవంశానికి చెందిన రఘునాథ అనే రాజు పాలనలో ఒకసారి హోలికా అనే రాక్షసి పిల్లలను ఇబ్బంది పెట్టిందని పురాణగాథ చెబుతుంది. ప్రజలు రాజును ఆశ్రయించగా, అక్కడ ఉన్న నారద మహర్షి ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణిమ రాత్రి హోలికను పూజిస్తే సమస్యలు తొలగుతాయని సూచిస్తారు. పగలు పూజిస్తే ఇబ్బందులు పెరుగుతాయని, కాబట్టి రాత్రివేళే ఆచరించాలని చెబుతారు. అప్పటి నుంచి హోలీ పండుగను రాత్రివేళ హోలికా దహనంతో ప్రారంభించే సంప్రదాయం కొనసాగుతోందని విశ్వసిస్తారు.

Details

వసంత బుతువు ప్రారంభ సూచిక

హోలీ చలికాలానికి వీడ్కోలు పలికి వసంత ఋతువు ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ కాలంలో పంట పొలాలు కొత్త పంటలతో కళకళలాడుతాయి. రైతుల ఇళ్లలో ఆనందం వెల్లివిరుస్తుంది. అందుకే హోలీని 'వసంత మహోత్సవం' లేదా 'కామ మహోత్సవం' అని కూడా పిలుస్తారు. సహజ రంగుల ప్రాముఖ్యత హోలీ సందర్భంగా ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సంప్రదాయంగా ఈ రంగులను సహజ పువ్వులతో, కల్తీ లేకుండా తయారు చేస్తారు. ముఖ్యంగా రాధారాణి గ్రామమైన బర్సానాలో పూల హోలీ, రంగుల హోలీ విశేషంగా నిర్వహిస్తారు. సహజ రంగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. మొత్తంగా చెడుపై మంచికి లభించిన విజయానికి, భక్తి మహిమకు, వసంత ఋతువు ఆరంభానికి ప్రతీకగా నిలిచిన పండుగే హోలీ.

Advertisement