Loading...
Durga Visarjan: దుర్గా నిమజ్జనం నీటిలోనే ఎందుకు చేస్తారు? విజయదశమి వెనుక ఉన్న అసలు కారణాలివే!
దుర్గా నిమజ్జనం నీటిలోనే ఎందుకు చేస్తారు? విజయదశమి వెనుక ఉన్న అసలు కారణాలివే!

Durga Visarjan: దుర్గా నిమజ్జనం నీటిలోనే ఎందుకు చేస్తారు? విజయదశమి వెనుక ఉన్న అసలు కారణాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 20, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్ష దశమి తిథిని విజయదశమిగా జరుపుకుంటారు. నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది రూపాలను భక్తిశ్రద్ధలతో పూజించిన అనంతరం, పదవ రోజున అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ దుర్గా విసర్జన నిర్వహిస్తారు. 2026లో అక్టోబర్ 20, మంగళవారం విజయదశమి సందర్భంగా దుర్గాదేవి నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతాయి. నవరాత్రుల సమయంలో ఎంతో భక్తితో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజలు నిర్వహిస్తారు. అయితే తొమ్మిది రోజుల పాటు ఆరాధించిన దుర్గాదేవి విగ్రహాలను పదో రోజున నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తారు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన ఏమిటి? పౌరాణిక విశ్వాసాలు ఏం చెబుతున్నాయి? ఈ ఆచారం వెనుక అనేక విశేషాలు ఉన్నాయి.

వివరాలు

పంచభూతాల్లో విలీనమవుతుందనే సందేశం

హిందూ తత్వశాస్త్రం ప్రకారం ఈ సృష్టి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే ఐదు మూలభూతాలతో ఏర్పడింది.

మట్టితో తయారు చేసిన దుర్గాదేవి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి, దైవస్వరూపంగా భావిస్తూ భక్తులు పూజలు నిర్వహిస్తారు.

తొమ్మిది రోజుల ఆరాధన అనంతరం ఆ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా అది తిరిగి ప్రకృతిలో కలిసిపోతుంది.

ఈ సంప్రదాయం సృష్టిలోని ప్రతి రూపం ప్రకృతి నుంచే పుట్టి, చివరకు ప్రకృతిలోనే విలీనమవుతుందనే గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది.

మనిషి శరీరంతో సహా భౌతిక రూపాలన్నీ శాశ్వతం కావని, కాలక్రమంలో ప్రకృతిలో కలిసిపోతాయని ఈ ఆచారం గుర్తుచేస్తుంది. శరీరం నశించినప్పటికీ దైవత్వం శాశ్వతంగా ఉంటుందనే ఆధ్యాత్మిక భావనను కూడా దుర్గా విసర్జన ప్రతిబింబిస్తుంది.

వివరాలు

కైలాసానికి తిరిగి వెళ్లే అమ్మవారు

దుర్గా విసర్జన వెనుక ప్రచారంలో ఉన్న మరో పౌరాణిక విశ్వాసం ప్రకారం.. నవరాత్రుల సమయంలో దుర్గాదేవి తన పుట్టిల్లయిన భూలోకానికి వచ్చిన కుమార్తెలా భావిస్తారు.

తొమ్మిది రోజుల పాటు భక్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా స్వాగతించి, పూజలు నిర్వహిస్తూ, ఉత్సవాలతో ఆనందంగా గడుపుతారు.

విజయదశమి రోజున అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ, శివుని నివాసమైన కైలాస పర్వతానికి తిరిగి సాగనంపుతారు.

నదులు, జలాశయాల్లో విగ్రహాలను నిమజ్జనం చేయడం ఈ విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. తొమ్మిది రోజుల పాటు తమ మధ్య కొలువైన అమ్మవారు తిరిగి తన నివాసానికి వెళ్తున్నారనే భావనతో భక్తులు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ADVERTISEMENT

వివరాలు

నీరు పవిత్రతకు, జీవానికి ప్రతీక

భారతీయ సంప్రదాయంలో నీటిని జీవనాధారంగా, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. నదులు పాపాలను తొలగించి, మనసును శుద్ధి చేస్తాయనేది భక్తుల విశ్వాసం.

నీరు లేకుండా జీవం సాధ్యం కాదనే భావన కూడా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కీలకంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో దుర్గాదేవి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు సమస్త ప్రపంచానికి చేరుతాయని భక్తులు నమ్ముతారు.

సృష్టికి నీరు ఆధారమనే భావనతో పాటు, ప్రకృతితో మనిషికి ఉన్న విడదీయలేని అనుబంధం ఈ ఆచారంలో అంతర్లీనంగా ఉంటుంది.

ADVERTISEMENT