
Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఈ రోజున తప్పకుండా బంగారం కొనాలా? లేకపోతే ఏమవుతుంది?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయను ఘనంగా జరుపుకుంటాం.
గతంలో ఇది అంతగా ప్రాచుర్యంలో లేని పండుగగా ఉన్నప్పటికీ, గత ముప్పై సంవత్సరాలుగా ఇది విస్తృతంగా ప్రాచారంలోకి వచ్చింది.
ఈ రోజున బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే అవి 'అక్షయంగా' అంటే చిరకాలం నశించకుండా ఉంటాయనే నమ్మకం ఉంది.
అయితే, అప్పు తీసుకుని బంగారం, వెండి కొనుగోలు చేస్తే ఆ అప్పులు కూడా 'అక్షయ'మే అవుతాయని తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి.
వివరాలు
అక్షయ ఫలితాన్ని ఇచ్చే శుభకార్యాలు
మత్స్యపురాణంలోని వివరాల ప్రకారం, శివుడు పార్వతీ దేవికి అక్షయ తృతీయ వ్రతాన్ని గురించి వివరించారు.
వైశాఖ శుద్ధ తదియనాడు చేసే వ్రతాలు, జపాలు, హోమాలు, దానాలు, ఇతర పుణ్యకార్యాలన్నీ అక్షయ ఫలాన్ని అందిస్తాయని చెప్పబడింది.
అలాగే, పుణ్యానికి అక్షయ ఫలం లభించినట్లే, పాపకార్యాలకు కూడా తరిగిపోయే ఫలితం ఉండదని గ్రహించాలి.
ఈ రోజున అక్షయుడైన శ్రీమహావిష్ణువు ఆరాధన విశేషంగా జరగడం వలన ఈ దినం "అక్షయ తృతీయ"గా ప్రసిద్ధి పొందింది.
వివరాలు
సంపూర్ణ వ్రత ఫలాన్ని పొందాలంటే ఇలా చేయాలి
విరగని, ముడతలు లేని బియ్యంతో అక్షతలను తయారు చేసి, ఆ అక్షతలను విష్ణుమూర్తి పాదాలపై ఉంచి భక్తిశ్రద్ధలతో పూజించాలి.
అనంతరం ఆ బియ్యాన్ని మళ్ళీ శుభ్రంగా చేసి, కొంత భాగాన్ని బ్రాహ్మణులకు దానం చేయాలి.
మిగిలిన భాగాన్ని దేవుడి నైవేద్యంగా భావించి, బ్రాహ్మణోచ్చిష్టంగా గుర్తించి భక్తితో ఆహారంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల అక్షయ తృతీయ వ్రత ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది.
వివరాలు
దానధర్మాలకు అపార ఫలితం - నారద పురాణం ప్రకారం
నారద పురాణం ప్రకారం అక్షయ తృతీయ రోజున చేసే దానాలు ఎన్నెన్నో కోట్లు పుణ్యఫలాన్ని అందిస్తాయని చెబుతుంది:
జలదానం: పానీయం ఏర్పాటు చేసి బాటసారులకు నీరు పంచితే, కోటి రెట్లు పుణ్యం లభిస్తుంది. పైగా స్వర్గలో ఉన్న పితృదేవతలు సంతోషిస్తారు.
అన్నదానం: అన్నదానమే మహాదానం అని పెద్దలు అంటారు. అక్షయ తృతీయ రోజున ఇచ్చే అన్నదానం వల్ల పొందే పుణ్యం అనిర్వచనీయమైనది.
ఛత్రదానం: ఈరోజున గొడుగు దానం చేసిన వారి వంశంలో ఎవరూ దారిద్ర్యాన్ని ఎదుర్కొనరు.
వస్త్రదానం: ఈ రోజు వస్త్రాలను దానం చేస్తే జీవితాంతం దారిద్ర్య సమస్య ఉండదు.
వివరాలు
గంగాతీరంలో దానాలకు అపూర్వ ఫలితాలు
నారద మహర్షి గంగా తీరంలో దానం చేసిన వారికి కలిగే ఫలితాల గురించి ఈ విధంగా వివరణ ఇచ్చారు:
వస్త్ర, ధాన్య దానం: గంగాతీరంలో దానం చేస్తే, కల్ప కోటిసహస్ర కాలం బ్రహ్మలోకంలో వాసం చేసి, బ్రహ్మజ్ఞానాన్ని పొందిన బ్రాహ్మణుడిగా మళ్ళీ జన్మించి అనంతరం మోక్షాన్ని పొందుతారు.
గోదానం: గంగాతీరంలో అక్షయ తృతీయ రోజున గోదానం చేసినవారు గోరాసంఖ్యల తాలుకూ సంవత్సరాల పాటు స్వర్గంలో జీవించి, భూమిపై పుట్టిన తర్వాత విద్య, ఐశ్వర్యాలను పొందుతారు.
కపిల గోదానం: వేదపండితుడైన బ్రాహ్మణులకు కపిల వర్ణపు ఆవును దానం చేస్తే, నరకంలో ఉన్న వారి పితృదేవతలు స్వర్గంలో స్థానం పొందుతారు.
వివరాలు
అక్షయ తృతీయ నాటి విశేష ఘటనలు
భూదానం: ఈ రోజు గంగాతీరంలో భూమిని దానం చేస్తే, ఆ భూమిలో ఉన్న ఇసుక రేణువుల సంఖ్యకు తగిన సంవత్సరాలపాటు త్రిలోకాల్లో నివసించి,అనంతరం సప్తద్వీపాధిపతిగా పుట్టి, చివరికి బ్రహ్మజ్ఞానంతో మోక్షాన్ని పొందుతారు.
శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను అందించాడు: ఈ సంఘటన అక్షయ తృతీయ రోజున జరిగిందని విశ్వాసం. అందువల్ల మధుర, ద్వారకలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
హిమాలయ ఆలయాలు తెరుచుకునే రోజు: యమునోత్రి, గంగోత్రి ఆలయాలు ఆరు నెలల విరామం తర్వాత ఈ రోజున తిరిగి తెరుచుకుంటాయి.
సింహాచలం అప్పన్న ఆలయంలో చందనోత్సవం: స్వామివారు ఏడాది మొత్తం చందనంతో కప్పబడి ఉంటారు. ఈ రోజు మాత్రమే నిజరూప దర్శనాన్ని భక్తులకు కలుగజేస్తారు.
వివరాలు
సంపద పోగు కాదు, పంచుకోవాలి!
ఈ రోజు బంగారం, వెండి కొనాలని ఎక్కడా శాస్త్రాలు చెప్పలేదు.
అసలు ఉద్దేశం - పుణ్య కార్యాలు చేయడం, దానం చేయడం. అప్పు తీసుకుని బంగారం కొనడం కాదు, అనవసర వ్యయాల నుంచి మానుకుని మనలో ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవాలి.
మన సంస్కృతిలో సంపదను విస్తరించుకోమని కాదు - పంచుకోమని చెబుతారు.
అక్షయ తృతీయ రోజున మన సామర్థ్యానికి తగినట్లుగా దానధర్మాలు చేసి, శుభఫలాలను పొందుతూ, సుఖసంతోషాలతో జీవిద్దాం.