
World Asthma Day 2025: ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా లక్షణాల మధ్య తేడాలను ఎలా గుర్తించాలి?
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్తమా అనేది వయస్సు అనే భేదం లేకుండా ఎవరినైనా ప్రభావితం చేసే శ్వాస సంబంధిత వ్యాధి.
ఈ వ్యాధిపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం 'ప్రపంచ ఆస్తమా దినోత్సవం'ను నిర్వహిస్తున్నారు.
ఉబ్బసం,ఊపిరితిత్తుల క్యాన్సర్ రెండింటిలోనూ దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు.
అందువల్ల ఈ రెండు వ్యాధులను స్పష్టంగా వేరు చేసి తెలుసుకోవడం అవసరం.
గ్లోబోకాన్ 2022 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నమోదైన కొత్త క్యాన్సర్ కేసుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ సుమారు 12.5 శాతాన్ని ఆక్రమించింది.
డబ్ల్యూహెచ్ఓ (WHO) గణాంకాల ప్రకారం, ఆస్తమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోంది.
ఈ వ్యాధి కారణంగా సంవత్సరానికి సుమారు ఐదు లక్షల మంది మరణిస్తున్నారు.
వివరాలు
అలెర్జీలకు కారణమయ్యే కొన్ని పదార్థాల వల్ల ఆస్తమా
ఈ రెండు వ్యాధులకు కొన్ని సామాన్య లక్షణాలు ఉన్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన సూచకాల ఆధారంగా మనం వాటి మధ్య తేడాను గుర్తించవచ్చు.
ఛాతీలో నొప్పి, దగ్గుతో రక్తం రావడం వంటి లక్షణాలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సూచనలుగా పరిగణించవచ్చు.
ఇక అలెర్జీలకు కారణమయ్యే కొన్ని పదార్థాల వల్ల ఆస్తమా ప్రేరేపించబడుతుంది.
పొగతాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది.
ఈ క్యాన్సర్, ఊపిరితిత్తులలో అసాధారణంగా పెరిగే కణాల వృద్ధితో ప్రారంభమవుతుంది.
ఆస్తమా అయితే శ్వాస మార్గాలు సంకుచితం కావడం వల్ల ఏర్పడుతుంది. ఈ రెండు వ్యాధుల లక్షణాల మధ్య స్పష్టతగా తేడా తెలుసుకోవడం చాలా అవసరం.
వివరాలు
ఉబ్బసం లక్షణాలు
ఉబ్బసం ఉన్నప్పుడు వ్యక్తికి పొడి దగ్గు లేదా తడి దగ్గు రావచ్చు. గొంతు, చెవి, ముక్కులో దురద అనుభవించవచ్చు.
ఊపిరి తీసుకునే సమయంలో శబ్దం వినిపించవచ్చు, ఇది సాధారణంగా "వీస్" అనే శబ్దంగా ఉంటుంది. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల ఇలా శబ్దాలు రావడం తక్కువగా ఉంటుంది.
ట్రిగ్గర్ కారకాలు
ఆస్తమా ఉన్న వ్యక్తులకు స్పష్టమైన ట్రిగ్గర్లు ఉంటాయి, ఇవి వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి.
ఇంట్లోని ధూళి, పుప్పొడి, వాయు కాలుష్యం, వ్యాయామం వంటి విషయాలు సాధారణ ట్రిగ్గర్లుగా ఉంటాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ప్రేరేపించే ప్రధాన కారణాలుగా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి, ముఖ్యంగా పొగతాగడం, వాయు కాలుష్యం వంటి అంశాలు.
వివరాలు
దగ్గుతో రక్తం రావడం
దగ్గుతో రక్తం రావడం అనేది సినిమాల్లో, సీరియల్స్‌లో మనం తరచూ చూస్తూనే ఉంటాం.
అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులలో ఈ లక్షణం 10-20 శాతం మందిలో మాత్రమే కనిపిస్తుంది. ఆస్తమా ఉన్నవారిలో మాత్రం దగ్గుతో రక్తం రావడం చాలా అరుదుగా జరుగుతుంది.
ఇతర సంబంధిత లక్షణాలు
ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల్లో అలసట, ఆకస్మిక బరువు తగ్గడం, ఎముక నొప్పులు, మెడ లేదా కాలర్‌బోన్ ప్రాంతంలో వాపులు, గడ్డలు, తలనొప్పి వంటి అదనపు లక్షణాలు కనిపించవచ్చు. అయితే బ్రాంకియల్ ఆస్తమా ఉన్నవారికి సాధారణంగా ఈ రకమైన లక్షణాలు ఉండవు.
వివరాలు
నియంత్రణలో ఉండే లక్షణాలు
ఆస్తమా చాలా సందర్భాల్లో మందులతో నియంత్రణలోకి తీసుకు వచ్చే అవకాశం ఉంది.
కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. దీని లక్షణాలు చికిత్స ప్రారంభించే వరకు అదుపులోకి రావడం చాలా కష్టం.