వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే: ఈ వ్యాధి రావడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స
బ్రెయిన్ ట్యూమర్ పై అవగాహన కలిగించడానికి, బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వారికి సపోర్ట్ ఇచ్చేందుకు, వాళ్ల కుటుంబాలకు అండగా ఉండడానికి, అలాగే బ్రెయిన్ ట్యూమర్ పై పరిశోధనలు చేస్తున్న వైద్య బృందాన్ని గుర్తించడానికి ప్రతీ ఏడాది జూన్ 8వ తేదీన వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ని జరుపుతారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ (IARC) ప్రకారం, ప్రతీ ఏటా బ్రెయిన్ ట్యూమర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. భారతదేశంలో సంవత్సరానికి 28వేల చొప్పున బ్రెయిన్ ట్యూమర్ బాధితులు పెరుగుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ అంటే: మెదడులో అసాధారణంగా పెరిగే కణతిని బ్రెయిన్ ట్యూమర్ అంటారు. ఈ ట్యూమర్లలో కొన్ని ప్రాణాంతకమైనవి ఉంటాయి, మరికొన్ని సాధారణమైనవి ఉంటాయి.
బ్రెయిన్ ట్యూమర్లు రావడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స
కొన్ని బ్రెయిన్ ట్యూమర్లు మెదడులోనే తయారవుతాయి. మరికొన్ని మాత్రం శరీరంలో క్యాన్సర్లుగా తయారై, మెదడుకు పాకి ట్యూమర్లుగా మారతాయి. ఈ వ్యాధి రావడానికి కారణాలు: ఇప్పటివరకు ఖచ్చితమైన కారణాన్ని ఎవ్వరూ చెప్పలేదు. కాకపోతే రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటే ట్యూమర్స్ తయారవుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ విషయమై పరిశోధన జరగాల్సి ఉంది. లక్షణాలు: మెదడులో ఏ ప్రాంతంలో కణతి ఏర్పడుతుందో దాని ప్రకారం లక్షణాలు ఉంటాయి. ఎక్కువమందిలో కంటుచూపు సమస్యలు, తలనొప్పులు, వాంతులు, మూర్ఛ రావడం జరుగుతుంది. ఒక్కోసారి మాటలు సరిగ్గా రాకపోవడం, వాసన తెలియకపోవడం, వినికిడి సమస్యలు, సరిగ్గా నడవలేకపోవడం మొదలగు లక్షణాలు ఉంటాయి.
బ్రెయిన్ ట్యూమర్ కు చికిత్స
ఎన్ హెచ్ పీ డేటా ప్రకారం బ్రెయిన్ ట్యూమర్లు వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది 9-12నెలల్లో మరణిస్తున్నారు. 3శాతం మంది మాత్రమే మూడేళ్ళ కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. చికిత్స: మెదడులో పెరిగిన కణతిని సర్జరీ చేసి తొలగిస్తారు. నాడీ వ్యవస్థకు ఎలాంటి సమస్య రాకుండా ట్యూమర్ ని తొలగించాల్సి ఉంటుంది. కీమో థెరపీ కూడా ఉపయోగిస్తారు. ఇండియాలో బ్రెయిన్ ట్యూమర్ కేసులు పెరుగుతున్నాయని సమాచారం.