వరల్డ్ హార్ట్ డే 2023: థీమ్, చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రతీ ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన వరల్డ్ హార్డ్ డే ని జరుపుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులపై జనాల్లో అవగాహన కల్పించడానికి, హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియజేయడానికి ఈరోజును జరుపుతున్నారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. దానిలో ఏదైనా సమస్యలు ఏర్పడితే ప్రాణానికే ప్రమాదం కలుగుతుంది. అందుకే గుండె ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది 1.7కోట్ల మంది గుండె సంబంధ వ్యాధుల వల్ల చనిపోతున్నారు. హార్ట్ అటాక్, స్ట్రోక్, కొరోనరీ హార్ట్ డిసీజ్ వంటి వ్యాధుల వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు.
వరల్డ్ హార్ట్ డే థీమ్
"మనసు పెట్టి హృదయం గురించి తెలుసుకో" (Use Heart, Know Heart) థీమ్ ని ఎంచుకున్నారు. ప్రతీ ఒక్కరూ తమ హృదయాల ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ థీమ్ ఎంచుకున్నారు. చరిత్ర: 1999లో వరల్డ్ హార్ట్ డే అనే కాన్సెప్ట్ మొదలైంది. దీనికి ఆద్యులు అంటోనీ బై డి లూనా. వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడైన ఆంటోనీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి వరల్డ్ హార్ట్ డే గురించి సూచించారు. అలా 2000 సెప్టెంబర్ 24 నాడు మొట్ట మొదటి వరల్డ్ హార్ట్ డే జరిగింది. అయితే 2012 లో వరల్డ్ హార్ట్ డే ని సెప్టెంబర్ 29కి మార్చారు. వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో దాదాపు 90దేశాలు పాల్గొంటాయి.