వరల్డ్ లూపస్ డే: రోగనిరోధక శక్తి కారణంగా వచ్చే ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ తెలుసుకోండి
లూపస్ అనేది ఆటో ఇమ్యూన్ రకానికి చెందిన వ్యాధి. ఈ వ్యాధి కారణంగా చర్మం, మూత్రపిండాలు, కీళ్లు, రక్త కణాలు, మెదడు, గుండె, ఊపిరితిత్తులు ప్రభావితం అవుతాయి. మన శరీరంలోని రోగ నిరోధక శక్తి శరీర కణజాలాల మీద అటాక్ చేయడంతో ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి, అలాగే ఈ వ్యాధిపై మరిన్ని పరిశోధనలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ లూపస్ డే ను మే 10వ తేదీన జరుపుతారు. ఈ వ్యాధి వల్ల చర్మం పైన దద్దుర్లు ఏర్పడతాయి, అక్కడక్కడ చర్మం ఉబ్బుతుంది. కీళ్లలో నొప్పి కలుగుతుంది. శ్వాస పీల్చుకునేటపుడు ఛాతిలో మంట, గుండె సమస్యలు, మూత్రపిండాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి.
లూపస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, జీవనశైలిలో మార్పులు
లక్షణాలు ఈ వ్యాధితో ఇబ్బంది పడేవారిలో అలసట, కండరాల నొప్పి, జ్వరము, ఊపిరి తీసుకునేటప్పుడు చాతిలో నొప్పి సూర్యరశ్మిని చూడలేకపోవడం, నోటి పూత, ఎముకల నొప్పులు, తలనొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. చికిత్స ఈ వ్యాధితో ఇబ్బంది పడేవారిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా దద్దుర్లు, కీళ్లనొప్పులు వంటి సమస్యలకు హైడ్రాక్సి క్లోరోక్విన్ అందిస్తారు. రోగ నిరోధక శక్తి ప్రభావాన్ని తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్స్ ఇస్తారు. నివారణ ఈ వ్యాధి రావడానికి అసలైన కారణం తెలియదు కాబట్టి నివారించడానికి ఏం చేయాలనేది ఎవ్వరికీ తెలియదు. కాకపోతే మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం ఒత్తిడి లేకుండా ఉండడం వల్ల ఈ వ్యాధిని ఎంతో కొంత నివారించవచ్చు.