వాల్ నట్స్ తో టీనేజర్ల మెదడు పనితీరు మెరుగు: స్పెయిన్ పరిశోధకుల వెల్లడి
శరీరానికి గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదు. గుండె ఆరోగ్యానికి గింజలు చాలా ఉపయోగపడతాయని అందరికీ తెలుసు. బాదం, వాల్ నట్స్, కాజు మొదలగునవి శరీరానికి పోషకాలను అందిస్తాయి. అయితే మీకు ఇది తెలుసా? యవ్వనంలోకి అడుగు పెట్టబోయే పిల్లలకు వాల్ నట్స్ మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. మెదడు పనితీరును మెరుగ్గా చేసి, ఏకాగ్రతను, దృష్టిని పెంచేలా చేస్తాయి. ఈ విషయమై స్పెయిన్ లో పరిశోధన జరిగింది. దాని వివరాలేంటో తెలుసుకుందాం. స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో కొన్ని పాఠశాలల నుండి 11-16సంవత్సరాల మధ్య గల వయసున్న వారిని 700మందిని ఈ పరిశోధన కోసం తీసుకున్నారు.
వందరోజుల పాటు జరిగిన పరిశోధన ప్రక్రియ
700మందిలో సగం మందికి రోజూ 30గ్రాముల వాల్ నట్స్ అందించారు. మిగతా సగానికి వాల్ నట్స్ అందించలేదు. ఇలా వందరోజుల పాటు వాల్ నట్స్ అందించిన తర్వాత ఫలితాలను చెక్ చేసారు. 100రోజుల పాటు వాల్ నట్స్ తిన్నవారిలో ఏకాగ్రత పెరిగిందని, ఒక పనిపై దృష్టి మెరుగయ్యిందనీ, మెదడు పనితీరు మెరుగ్గా ఉందని కనుగొన్నారు. దీనికి గల ముఖ్య కారణం వాల్ నట్స్ లోని ఒమేగా 3 కొవ్వు రకమైన ఆల్ఫా లినోలినిక్ ఆమ్లం కారణమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అందుకే పిల్లలకు వాల్ నట్స్ అందించడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఈ పరిశోధన బృందం, గర్భిణీ స్త్రీలపై ఇలాంటి పరిశోధన చేసి, వాల్ నట్స్ ప్రభావం శిశువుల్లో ఎలా ఉండనుందో తెలుసుకోవాలని అనుకుంటోంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి