ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రతి ఏడాది మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుతారు. పొగాకు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడానికి, పొగాకును వదిలివేయడం వల్ల ఆరోగ్యం ఎలా మెరుగు పడుతుందో తెలియజేయడానికి ఈరోజును జరుపుతారు. పొగాకు అనేది నికోటియానా మొక్క ఆకులను సూచిస్తుంది. ఈ ఆకులను వివిధ రకాలుగా ప్రాసెస్ చేసి సిగరెట్లు, సిగార్లు మొదలైన పొగాకు ఉత్పత్తులను తయారు చేస్తారు. పొగాకులో ఉండే నికోటిన్ మనుషుల్ని తన బానిసలుగా మార్చేసుకుంటుంది. నికోటిన్ కు అలవాటు పడిన వ్యక్తి దాన్ని వదల్లేడు. పదేపదే నికోటిన్ తీసుకోవాలని అనుకుంటాడు. పొగాకు వినియోగం పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. డయాబెటిస్, క్యాన్సర్, గుండె సంబంధ సమస్యలు మొదలైనవి పొగాకు వల్ల వస్తాయి.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం 2023 థీమ్
"మనకు ఆహారం కావాలి పొగాకు కాదు" అనే థీమ్ తో 2023 పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పొగాకు పండించే రైతులకు ప్రత్యాన్మాయం పంటపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987లో నిర్ణయించింది. ఆ సమయంలో కేవలం ఒకే సంవత్సరం జరపాలని 1988 ఏప్రిల్ 7న మొదటిసారిగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరిపింది. కానీ పొగాకు వల్ల వచ్చే సమస్యలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ప్రతీ ఏటా పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 31న జరపాలని 1988లో నిర్ణయించింది. అప్పటినుండి ప్రతి ఏడాది మే 31న పొగాకు వల్ల కలిగే నష్టాలను అందరికీ తెలియజేసే కార్యక్రమాలు నిర్వహిస్తోంది.