ప్రపంచ తాబేలు దినోత్సవం: నీటిలో నివసించే తాబేలుకు, భూమి మీద నివసించే తాబేలుకు మధ్య తేడాలు
తాబేళ్ళలో చాలా రకాలున్నాయి. నీటిలో నివసించే తాబేళ్ళు, భూమి మీద నివసించే తాబేళ్లు. భూమిలోపల తాబేళ్ళు చేసే రంధ్రాల వల్ల అనేక జీవులు అందులో నివసిస్తాయి. అలాగే సముద్రంలో చనిపోయిన చేపలను తాబేళ్ళు తినేస్తాయి. తాబేళ్ళ మనుగడను సురక్షితంగా ఉంచడానికి మానవ చర్యల వల్ల తాబేళ్ళ జీవనానికి ఎలాంటి విపత్కర పరిస్థితులు రాకూడదని ప్రతీ ఏడాది మే 23వ తేదీన ప్రపంచ తాబేళ్ల దినోత్సవం జరుపుతారు. ముందుగా 2002లో తాబేళ్ళ దినోత్సవం జరుపుకోవడం మొదలైంది. అమెరికాకు చెందిన తాబేళ్ల సంరక్షణ సంఘం మొదలు పెట్టిన ఈ దినోత్సవాన్ని ఇప్పటికీ జరుపుకుంటున్నారు. తాబేళ్ళ సంరక్షణ సంఘాన్ని సుసాన్ టెల్లెమ్, మార్షల్ థాంప్సన్ ప్రారంభించారు.
నీటిలో నివసించే, భూమి మీద నివసించే తాబేలుకు మధ్య తేడాలు
నీటిలో నివసించే వాటిని టర్టిల్స్ అంటారు. ఎక్కువ శాతం భూమి మీద ఉండే తాబేళ్ళను టార్టాయిస్ అంటారు. టర్టిల్స్ ఎక్కువగా సముద్రంలో ఉంటాయి. టార్టాయిస్ ఎక్కువగా అడవి ప్రాంతాల్లో, పచ్చిక బయళ్లలో కనిపిస్తాయి. టర్టిల్స్ పైన ఉండే పెంకు మందం తక్కువగా ఉంటుంది. టార్టాయిస్ పెంకుమందం చాలా ఎక్కువగా ఉంటుంది. టర్టిల్స్ ఎక్కువగా మాంసాహారం తింటాయి. టార్టాయిస్ మాత్రం మొక్కలకు సంబంధించిన ఆహారాలను ఎక్కువగా తింటాయి. టర్టిల్స్ 20-40సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాయి. టార్టాయిస్ మాత్రం 80-150ఏళ్ళ వరకు బ్రతుకుతాయి. టర్టిల్స్ అన్నీ టార్టాయిస్ కాదు, కానీ టార్టాయిస్ అన్నీ టర్టిల్స్ అని చెప్పవచ్చు.