ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం 2023: చరిత్ర, విశేషాలు, తెలుసుకోవాల్సిన విషయాలు
అడవి జంతువులు, మొక్కలపై అవగాహన పెంచేందుకు ప్రతీ ఏడాది మార్చ్ 3వ తేదీన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ భూమ్మీద లెక్కలేనన్ని జీవులున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన జీవులు కనిపిస్తాయి. ఎడారుల్లో పెరిగే జీవులు కొన్ని అయిఏ, మంచులో పెరిగే జీవులు మరికొన్ని.. ఇలా కొన్ని కోట్ల జీవులు భూమి మీద జీవిస్తున్నాయి. ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవ ముఖ్య లక్ష్యం ఏంటంటే, భూమ్మీద వన్యజీవులకు వచ్చే ఇబ్బందులను తెలుసుకోవడం, దానివల్ల ఆ జీవజాతులను పరిరక్షించడం. ఇంకా జంతువుల మీద జరుగుతున్న నేరాలను ఆపడం. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం 2023 థీమ్: వన్యప్రాణులను సంరక్షించడంలో భాగస్వామ్యం. దీని ప్రకారం జంతుజాలాన్ని, మొక్కలను రక్షించడానికి మీ వంతు పాత్ర పోషించాలి.
అంతరించిపోతున్న వన్యప్రాణులపై అంతర్జాతీయ CITES ఒప్పందం
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని 2013లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అమోదించింది. ఐతే అంతకు ముందే 1973లో వన్యప్రాణుల విషయంలో అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం (CITES) ప్రకారం, అంతరించిపోయే దశలో ఉన్న జంతువులను, మొక్కలను అంతర్జాతీయంగా వాణిజ్యం చేయకూడదు. ఆయా జాతుల చర్మాలతో లెదర్ వస్తువులు, ఆహారం, మెడిసిన్స్ తయారు చేయడం జరగకూడదు. ఈ ఒప్పందం కారణంగా దాదాపు 37వేల కంటే ఎక్కువ రకాల వన్యప్రాణులకు రక్షణ దొరుకుతుంది. అంతరించిపోయే దశలో ఉన్న జంతువులను, మొక్కలను సైట్స్ కి జోడిస్తే, ఆ మొక్కలు, జంతువుల మీద అంతర్జాతీయ వ్యాపారాలు నిషిద్ధం అవుతాయి. ఈ విధంగా ఆయా జాతులను కాపాడవచ్చని సైట్స్ ఆలోచన.