వరల్డ్ జూనోసిస్ డే: జంతువుల నుండి వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేకరోజు పై ప్రత్యేక కథనం
ప్రతీ ఏడాది జులై 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ జూనోసిస్ డే జరుపుకుంటారు. జంతువుల ద్వారా మనుషులకు, మనుషుల ద్వారా జంతువులకు వచ్చే వ్యాధులను జూనోసిస్ అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి చేసిన ప్రకారం, జూనోసిస్ వ్యాధులకు బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులు కారకాలుగా నిలుస్తాయి. జంతువులను ప్రత్యక్షంగా తాకడం, జంతువుల వల్ల కలుషితమైన ఆహారం, నీరు మొదలగు వాటిని మానవుడు వినియోగిస్తే జూనోసిస్ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. జూనోసిస్ వ్యాధులకు మొదటిసారి వ్యాక్సిన్ కనుగొన్న కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జులై 6వ తేదీన వరల్డ్ జూనోసిస్ డే జరుఉకుంటారు. ఈరోజున జూనోసిస్ వ్యాధులపై అవగాహన కల్పిస్తారు.
జూనోసిస్ డే చరిత్ర
1885 జులై 6వ తేదీన మొదటిసారిగా ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్, రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ ను కనుగొన్నాడు. కుక్కల కారణంగా వచ్చే రేబిస్ వ్యాధికి మొదటిసారిగా వ్యాక్సిన్ ని కనుగొనడంతో, ఆరోజును గుర్తుంచుకునేందుకు జూనోసిస్ డే జరుపుకుంటారు. జంతువులను పెంచుకునే వారికి జూనోసిస్ వ్యాధులపై అవగాహన ఉండాలని, వాటికి సరైన సమయాల్లో వ్యాక్సిన్లు వేయించాలని దానివల్ల మానవాళికి ఆరోగ్యం చేకూరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తుంది. జూనోసిస్ రోజును ఏ విధంగా జరుపుకోవాలంటే? సోషల్ మీడీయాలో జూనోసిస్ డే గురించి, జూనోసిస్ వ్యాధుల గురించి షేర్ చేసి ఇతరులకు అవగాహన కల్పించాలి. పెంపుడు జంతువులను ఎలా చూసుకోవాలో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియజేయాలి.