నడుము చుట్టూ పేరుకున్న కొవ్వును యోగా తగ్గించేస్తుందా? ఈ ఆసనాలు ప్రయత్నించండి
పొట్టకొవ్వు, నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడం అంత సులభం కాదు. దీనికోసం కొన్ని యోగాసనాలు పనిచేస్తాయి. అలాగే ఆహార అలవాట్లలో మార్పులు తీసుకురావాలి. ప్రస్తుతం నడుము చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడానికి పనికొచ్చే ఆసనాలు ఏంటో చూద్దాం. భుజంగాసనం: ఈ ఆసనం వల్ల మీ ఛాతి విశాలమవుతుంది. అంతేకాదు నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. యోగా మ్యాట్ మీద బోర్లాపడుకుని అరచేతులను భుజాల పక్కన ఆనించి, ఊపిరి పీల్చుకుని కేవలం నడుము నుండి పైభాగాన్ని మాత్రమే పైకి లేపాలి. కొన్నిసెకన్లు అలాగే ఉండి మళ్లీ సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తే నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోయి అందంగా తయారవుతుంది.
నడుము కొవ్వును తగ్గించే యోగాసనాలు
హలాసనం: వెల్లకిలా పడుకుని కాళ్ళను గాల్లో పైకి లేపి నెమ్మదిగా తల వెనకభాగంలోకి తీసుకురావాలి. ఈ ప్రాసెస్ లో మీ చేతులు నేలమీదే ఉండాలి. మీకు బ్యాలన్స్ సరిగ్గా ఉండాలంటే రెండు చేతులను వేళ్ళతో లాక్ చేసేయండి. ఉష్ట్రాసనం: మోకాళ్ళ మీద కూర్చుని పాదం పై భాగాలు నేలను పూర్తిగా తాకేవిధంగా ఉంచి, రెండు చేతులతో రెండు కాళ్ళ మడమలను పట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉన్న తర్వాత యధాస్థానానికి రావాలి. ధనూరాసనం: బోర్లా పడుకుని మోకాలి వరకు కాళ్ళను మడవాలి. ఇప్పుడు చేతులతో కాలి మడమలను గట్టిగా పట్టుకోవాలి. ఈ పొజిషన్ లో మీ శరీరం, ధనుస్సులా కనిపిస్తుంది. మీ శరీరాన్ని సాధ్యమైనంత సాగదీసి ఈ ఆసనం చేయాలి.