ఆహారానికి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే గిన్నిస్ రికార్డ్స్
ఆహారానికి సంబంధించిన విషయంలో గిన్నిస్ రికార్డ్స్ గురించి మీకు తెలుసా? 100 అడుగుల దోస తయారు చేయడం నుండి ఒక నిమిషంలో అత్యధిక వెల్లుల్లిపాయలను తినడం వరకు అనేక రికార్డ్స్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రస్తుతం ఆ రికార్డ్స్ ఏంటో తెలుసుకుందాం. జీవితకాలంలో ఎక్కువ బర్గర్స్ తిన్న వ్యక్తి: అమెరికాలోని విస్కాన్సిన్ నగరానికి చెందిన డోనాల్డ్ గోర్స్కీ అనే వ్యక్తి, 1972 నుండి తన జీవితకాలం మొత్తంలో 32,340 బర్గర్లను తిన్నాడు. అతను తాను తినడం మొదలు పెట్టినప్పటి నుండి కొన్న ప్రతీ బర్గర్ ప్యాకెట్, బిల్ ని దాచుకున్నాడు. బర్గర్లను ఎక్కువగా తిన్నప్పటికీ అతని రక్తంలో చక్కెర శాతం సాధారణ స్థాయిలోనే ఉందట. దానికి కారణం ప్రతిరోజు అతడు 6మైళ్ళు నడవడమే.
దోసకోసం 105అడుగుల పెనం తయారీ
అత్యధిక వెల్లుల్లిపాయలు తిన్న వ్యక్తి: అమెరికాకు చెందిన ప్యాట్రిక్ బెర్టోలెట్టీ అనే వ్యక్తి, 2012 జనవరిలో ఒక నిమిషంలో 36 వెల్లుల్లిపాయలను తిని గిన్నిస్ రికార్డ్ సాధించాడు. అత్యధిక మిరపకాయలు తిన్న వ్యక్తి: భుట్ జోలోకియా అనే అధిక కారం కలిగిన 10 మిరపకాయలను జార్జ్ ఫాస్టర్ అనే వ్యక్తి 33.15సెకండ్లలో తిని గిన్నిస్ రికార్డ్ సాధించాడు. అతి పెద్ద దోస: చెన్నైలోని శరవణ భవన్ రెస్టారెంట్ కి చెందిన 60మంది వంటవారు 100అడుగుల దోసను తయారు చేశారు. దీని కోసం 37.5కిలోల దోసపిండి వాడారు. ప్రత్యేకంగా ఈ దోశను తయారు చేయడానికి 105అడుగుల పెనం తయారు చేశారు.
1995 కేజీల కిచిడీ తయారీ
హిమాచల్ ప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్, దుర్గాదేవి బహరీలాల్ ఛారిటబుల్ ట్రస్ట్ కలిసి 1995 కేజీల కిచిడీని ఒకేసారి తయారు చేశారు. దీని కోసం 7x4అడుగుల కుండను వాడారు. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులకు కిచిడీ అందించడానికి ఇలా చేశారు. దీంతో గిన్నిస్ రికార్డును అందుకున్నారు.