National cyber-attack: సైబర్ దాడితో స్తంభించిన 100 ఆస్పత్రులు.. పెన్, పేపర్‌తోనే హ్యాకర్లకు చెక్!
ఈ వార్తాకథనం ఏంటి
రోమేనియాలో 2024 ఫిబ్రవరిలో జరిగిన భారీ సైబర్ దాడి దేశవ్యాప్తంగా వైద్య రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. కంప్యూటర్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు వందకు పైగా ఆస్పత్రుల వ్యవస్థలను దెబ్బతీయడంతో రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన రోమేనియా జాతీయ సైబర్ భద్రతా కేంద్రం (DNSC) అత్యవసర నిర్ణయం తీసుకుంది. హ్యాకర్ల వ్యాప్తిని అడ్డుకునేందుకు 100కు పైగా ఆస్పత్రులను వెంటనే ఇంటర్నెట్ నుంచి డిస్‌కనెక్ట్ చేయాలని ఆదేశించింది. ఈ చర్యతో హ్యాకర్ల దాడి మరింత విస్తరించకుండా అడ్డుకోగలిగారు. అయితే ఇంటర్నెట్ నిలిపివేయడంతో ఆస్పత్రుల్లోని కనెక్టెడ్ పరికరాలు, ఈ-మెయిల్స్, వెబ్ బ్రౌజర్లు పనిచేయడం ఆగిపోయింది.
వివరాలు
పెన్-పేపర్‌ను ఆశ్రయించాల్సి ఉంది
దీంతో వైద్య సిబ్బంది తిరిగి పాత విధానమైన పెన్-పేపర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా వైద్యులు, నర్సులు ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేస్తుండగా, ఐటీ బృందాలు సమస్య పరిష్కారానికి రాత్రింబవళ్లు శ్రమించాయి. ఈ దాడికి కారణమైనది బుఖారెస్ట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ ఆర్ఎస్‌సీ. సంస్థ అభివృద్ధి చేసిన 'హిప్పోక్రేట్స్' (Hippocrates) అనే వైద్య నిర్వహణ వ్యవస్థలోకి హ్యాకర్లు చొరబడి 'BackMyData' అనే ర్యాన్సమ్‌వేర్‌ను ప్రవేశపెట్టారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆస్పత్రులలో రోగుల నమోదు, పరీక్షల ఫలితాలు, ఔషధాల సరఫరా, జీతాల చెల్లింపులు వంటి అనేక కీలక కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి.
వివరాలు
మొదట ఫిబ్రవరి 10న దాడి ప్రారంభం
బుజావ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న సర్జన్ ఓనా గోయిడెస్కు మాట్లాడుతూ, "రోగుల జాబితా మాత్రమే కాదు, పరీక్షలు, మందులు, రేడియాలజీ వివరాలు సహా అన్నీ ఒక్కసారిగా అందుబాటులో లేకపోయాయి. అది చాలా క్లిష్టమైన అనుభవమని తెలిపారు. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఈ దాడిని తొలుత పిటెష్టి చిన్నారుల ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. అనంతరం దేశవ్యాప్తంగా అనేక ఆస్పత్రులు 'హిప్పోక్రేట్స్' వ్యవస్థ పనిచేయడం లేదని నివేదించాయి. దాడి తర్వాత సైబర్ నిపుణులు, సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ ప్రతినిధులు కలిసి వ్యవస్థలను పరిశీలించగా 26 ఆస్పత్రులు 'BackMyData'ర్యాన్సమ్‌వేర్ బారిన పడినట్లు గుర్తించారు. హ్యాకర్లు ఫైళ్లను ఎన్‌క్రిప్ట్ చేసి వాటిని తిరిగి అందించేందుకు బిట్‌కాయిన్ రూపంలో1.60లక్షల యూరోల (దాదాపు 1.83 లక్షల డాలర్లు) విమోచన ధనం డిమాండ్ చేశారు.
వివరాలు
కీలక నిర్ణయం తీసుకున్న రోమేనియా ప్రభుత్వం
అయితే రోమేనియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఎలాంటి పరిస్థితుల్లోనూ హ్యాకర్లకు డబ్బు చెల్లించవద్దని ఆస్పత్రులకు సూచించింది. అలాగే హ్యాకర్లతో నేరుగా సంప్రదింపులు జరపవద్దని హెచ్చరించింది. వ్యవస్థలు పనిచేయకపోవడంతో బుఖారెస్ట్‌లోని కరోల్ డావిలా ఆస్పత్రి సహా అనేక ఆస్పత్రులు ఆఫ్‌లైన్ విధానాలను అమలు చేశాయి. రోగుల వివరాలను చేతితో నమోదు చేయడం, ప్రయోగశాల ఫలితాలను కాగితాలపై అందించడం, ఎక్సెల్ వంటి ఆఫ్‌లైన్ టూల్స్ ఉపయోగించడం ద్వారా వైద్య సేవలు కొనసాగించాయి. ఈ సమయంలో ప్రజలకు కూడా కీలక సూచనలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు లేకపోతే ఆస్పత్రులకు రావద్దని కోరారు. అయినప్పటికీ ఆస్పత్రుల్లో రద్దీ కొనసాగడంతో కొంతమంది రోగులు, వారి కుటుంబ సభ్యులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వైద్యులు తెలిపారు.
వివరాలు
బాధిత వ్యవస్థలు బ్యాకప్‌ల సాయంతో పునరుద్ధరణ
సైబర్ నిపుణులు నిరంతరంగా పనిచేసి బాధిత వ్యవస్థలను బ్యాకప్‌ల సహాయంతో పునరుద్ధరించారు. ఐదు రోజుల వ్యవధిలోనే చాలా ఆస్పత్రులు తిరిగి సాధారణ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ దాడి కారణంగా ఎలాంటి మరణాలు లేదా తీవ్రమైన ఆరోగ్య నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. అయితే ఆఫ్‌లైన్ సమయంలో సేకరించిన సమాచారాన్ని తిరిగి డిజిటల్ వ్యవస్థల్లో నమోదు చేయడానికి మరికొన్ని వారాలు పట్టింది. కొంత డేటా శాశ్వతంగా కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ పోలీసులు ఇప్పటివరకు వివరాలు వెల్లడించలేదు. అయితే గతంలో 'BackMyData' ర్యాన్సమ్‌వేర్‌కు సంబంధించిన నేర ముఠాపై అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకుని, రష్యాకు చెందిన నలుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం.
వివరాలు
హ్యాకర్ల ప్రధాన లక్ష్యం అదే
సైబర్ భద్రతా నిపుణుల ప్రకారం, ఆస్పత్రులు అత్యవసర సేవలు అందించే సంస్థలు కావడంతో వాటిపై దాడి చేస్తే గందరగోళం ఎక్కువగా ఏర్పడుతుంది. అదే హ్యాకర్ల ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగం ప్రస్తుతం సైబర్ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారిందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల బ్రిటన్‌లోని NHS ఆరోగ్య సేవలు, అమెరికాలోని Change Healthcare, Ascension వంటి సంస్థలపై కూడా ఇలాంటి సైబర్ దాడులు జరిగాయి. దీంతో వైద్య రంగంలో సైబర్ భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.