LOADING...
Instagram: 16 గంటల వాడకం వ్యసనం కాదు.. టీవీతో పోల్చిన ఆడమ్ మొస్సేరి
16 గంటల వాడకం వ్యసనం కాదు.. టీవీతో పోల్చిన ఆడమ్ మొస్సేరి

Instagram: 16 గంటల వాడకం వ్యసనం కాదు.. టీవీతో పోల్చిన ఆడమ్ మొస్సేరి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

లాస్ ఏంజిల్స్ కోర్టులో సాగుతున్న ఈ విచారణ ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గత ఎనిమిదేళ్లుగా ఇన్‌స్టాగ్రామ్‌ను నడిపిస్తున్న ఆడమ్ మొస్సేరి బాధితుల తరపు న్యాయవాదుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక యువతి తన జీవిత పతనానికి ఇన్‌స్టాగ్రామ్‌నే కారణమని పేర్కొంటూ దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు సోషల్ మీడియా కంపెనీల బాధ్యతపై విశాలమైన చర్చను రేకెత్తించింది.

Details

16 గంటల వాడకం.. వ్యసనం కాదా?

విచారణలో భాగంగా ప్రధాన బాధితురాలు ఒకే రోజులో 16 గంటల పాటు ఇన్‌స్టాగ్రామ్ వినియోగించినట్లు వెల్లడైంది. దీనిపై మొస్సేరి స్పందిస్తూ, ఇది "సమస్యాత్మక వినియోగం" అని అంగీకరించినప్పటికీ, దానిని 'వ్యసనం'గా పేర్కొనడానికి నిరాకరించారు. అర్థరాత్రి వరకు టీవీ షోలు వీక్షించడం ఎలా సాధారణమో, గంటల తరబడి సోషల్ మీడియా వినియోగం కూడా అంతే అని ఆయన పోల్చడం కోర్టులో ఆశ్చర్యాన్ని కలిగించింది. అధిక వినియోగం అన్నదే తప్పనిసరిగా హానికరమని చెప్పలేమని ఆయన వాదించారు. బాధితురాలు తనపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దాదాపు 300 సార్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది.

Details

ఆరోపణలకు బలమైన సమధానం

అయితే ఈ విషయం తనకు తెలియదని మొస్సేరి కోర్టులో అంగీకరించడం గమనార్హం. వినియోగదారుల భద్రత కంటే కంపెనీ వృద్ధికే మెటా ప్లాట్‌ఫారమ్‌లు ప్రాధాన్యం ఇస్తోందన్న ఆరోపణలకు ఈ సమాధానం బలం చేకూర్చింది. అలాగే ముఖాకృతి మార్చే ఫిల్టర్ల ప్రభావం యువతలో ఆత్మన్యూనత భావాన్ని పెంచుతుందని గతంలో అధికార వర్గాల్లో చర్చ జరిగినప్పటికీ, ఆ ఫిల్టర్లపై విధించిన పరిమితులను నిశ్శబ్దంగా ఎత్తివేసినట్లు విచారణలో బయటపడింది.

Advertisement

Details

కన్నీటి నిరసనలు

కోర్టు వెలుపల పలువురు తల్లిదండ్రులు ఇన్‌స్టాగ్రామ్ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. లండన్ నుంచి వచ్చిన మారియానో జానిన్ అనే తండ్రి తన 14 ఏళ్ల కుమార్తె మియా ఫోటోను పట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. 2021లో తన కుమార్తె ఆత్మహత్యకు సోషల్ మీడియా వేధింపులే కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "కంపెనీలు తమ వ్యాపార నమూనాను మార్చుకోవచ్చు. పిల్లల రక్షణకు కావాల్సిన సాంకేతికత, వనరులు వారి వద్ద ఉన్నాయి. అయినప్పటికీ లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు" అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆలోచనలకు దారితీశాయి. ఈ కేసులో మెటా మాత్రమే కాకుండా యూట్యూబ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది.

Advertisement

Details

టెక్నాలజీ ముప్పుగా మారకూడదు

ఇప్పటికే స్నాప్ చాట్, టిక్ టాక్ వంటి సంస్థలు ఇలాంటి ఆరోపణలపై కోర్టు బయటే రాజీకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణ కొనసాగుతున్న కొద్దీ మార్క్ జుకర్‌బర్గ్, యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ వంటి అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్‌లు కూడా సాక్ష్యమివ్వాల్సి రావచ్చని సమాచారం. భవిష్యత్తులో సోషల్ మీడియా సంస్థలు పిల్లల భద్రత విషయంలో ఎంత బాధ్యత వహించాలనే అంశంపై మార్గదర్శక తీర్పుగా నిలిచే అవకాశముంది. లాభాల కోసం యువత మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాయన్న ఆరోపణలు నిజమా? 16 గంటల వినియోగాన్ని కేవలం 'హెవీ ఎంగేజ్‌మెంట్'గా తేల్చేయడం సరైనదా? అభివృద్ధికి దోహదపడాల్సిన టెక్నాలజీ ప్రాణాలకు ముప్పుగా మారకూడదనే సందేశం ఈ కేసు మరింత బలంగా వినిపిస్తోంది.

Advertisement