178 websites malware: జూమ్ నుంచి HSBC వరకు.. 178 వెబ్‌సైట్లపై హ్యాకర్ల కన్ను
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్నెట్‌లో ప్రముఖ బ్రాండ్ల వెబ్ సైట్లు చూస్తున్నప్పుడు కూడా సైబర్ ముప్పు పొంచి ఉంటుందని తాజా ఘటన మరోసారి చూపించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 178 సంస్థలకు చెందిన వెబ్‌సైట్లలో హానికరమైన కోడ్ చొప్పించినట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ జాబితాలో Zoom, Salesforce, HSBC, IKEA, Crocs వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఈ మాల్‌వేర్ ద్వారా వెబ్‌సైట్‌ను సందర్శించే వారి క్రెడిట్ కార్డు వివరాలు, క్రిప్టోకరెన్సీ వాలెట్ అడ్రస్‌లను హ్యాకర్లు టార్గెట్ చేసే అవకాశం ఉంది.
Details
Optimizely ద్వారా మాల్‌వేర్ ప్రవేశం
సైబర్ సెక్యూరిటీ సంస్థ Report URI పరిశీలనలో ఈ విషయం బయటపడింది.
మొత్తం 1,611 Optimizely Web జావాస్క్రిప్ట్ స్నిప్పెట్లను పరిశీలించగా, అందులో 188 స్నిప్పెట్లు ఇన్‌ఫెక్ట్ అయినట్లు గుర్తించారు.
ఇవి 178 సంస్థలకు సంబంధించినవి. కంపెనీలు తమ వెబ్‌సైట్లలో ప్రయోగాలు, A/B టెస్టింగ్ కోసం ఉపయోగించే Optimizely ప్లాట్‌ఫామ్‌లోని ఒక ఫీల్డ్‌ను హ్యాకర్ దుర్వినియోగం చేసినట్లు పరిశోధకులు తెలిపారు.
Details
కాపీ చేసిన క్రిప్టో అడ్రస్ కూడా మారిపోయే ప్రమాదం
ఈ మాల్‌వేర్ వెబ్‌పేజీల్లోని ఫారాలు, లింకులు, చిత్రాలు, క్లిప్‌బోర్డ్లను పరిశీలిస్తూ క్రిప్టో వాలెట్ అడ్రస్‌ల కోసం వెతికింది.
ఎవరైనా క్రిప్టో అడ్రస్‌ను కాపీ చేస్తే.. దాన్ని హ్యాకర్ వాలెట్ అడ్రస్‌తో మార్చేలా కోడ్ పనిచేసింది.
అలాగే వెబ్‌సైట్‌లో నేరుగా నమోదు చేసిన క్రెడిట్ కార్డు వివరాలను కూడా దొంగిలించే అవకాశం ఉంది.
iPhone, iPadలను టార్గెట్ చేసే Coruna, DarkSword ఎక్స్‌ప్లాయిట్ కిట్లను కూడా ఉపయోగించినట్లు నివేదిక పేర్కొంది.
Details
ఇప్పటికే రూ.6.6 లక్షల క్రిప్టో చెల్లింపులు
నవంబర్ 16న రాత్రి 12:55 గంటల IST నాటికి హ్యాకర్లకు చెందిన క్రిప్టో వాలెట్లలో సుమారు 7,040 డాలర్లు అంటే దాదాపు రూ.6.6 లక్షలు చేరినట్లు పరిశోధకులు తెలిపారు.
HSBC, Equifax, Zoom, Salesforce, Bitlyతో పాటు BBC, CNN, Fox News, UNICEF USA వంటి సంస్థల వెబ్‌సైట్లు కూడా ప్రభావితమైన జాబితాలో ఉన్నాయి.
అయితే సమస్యను గుర్తించిన తర్వాత Optimizely లోపాన్ని సరిచేసి, ప్రభావిత ప్రాజెక్టుల నుంచి హానికరమైన కోడ్‌ను తొలగించినట్లు వెల్లడించింది.