Longest Solar Eclipse: 2027 శతాబ్ధంలో సుదీర్ఘ సూర్య గ్రహణం.. 6 నిమిషాల పాటు అంధకారం...
ఈ వార్తాకథనం ఏంటి
2027లో ఓ అద్భుతం జరగబోతోంది. తరతరాల పాటు గుర్తుండిపోయే అరుదైన ఘటన జరగనుంది. భూమిపై అనేక ప్రాంతాలు ఒక్కసారిగా చీకటిలో మునిగిపోవనున్నాయి. మధ్యాహ్నం సమయంలోనే నిశి చీకట్లు కమ్ముకోనున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు కనిపించేంతగా వెలుతురు తగ్గిపోనుంది. భూమి తిరగటం ఆగిపోయిందేమో అన్నట్టుగా మొత్తం వాతావరణం అనిపించనుంది. ఈ అసాధారణ పరిస్థితికి కారణం అత్యంత అరుదైన ఒక ఖగోళ సంఘటన. 2027 ఆగస్టు 2న 21వ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘకాలం కొనసాగే సూర్య గ్రహణం చోటుచేసుకోనుంది.
వివరాలు
దీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి
ఈ గ్రహణం ప్రభావిత ప్రాంతాలు మొత్తం 6 నిమిషాలు 23 సెకన్ల పాటు పూర్తిగా చీకటిలో ఉండబోతున్నాయి. గత శతాబ్దంలో ఇలాంటి దీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కాబోతోంది. ఈ గ్రహణం అట్లాంటిక్ మహాసముద్రం వద్ద ప్రారంభమై, చంద్రుని నీడ సూర్యుడిని పూర్తిగా కప్పేస్తుంది. దక్షిణ స్పెయిన్, మొరాక్కో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్, మధ్యప్రాచ్యంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోతాయి. దాదాపు ఆరున్నర నిమిషాల పాటు సూర్యుడి కాంతి కనబడకుండా పోతుంది.
వివరాలు
ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు
సౌత్ అమెరికా ఖండంలోని కొన్ని ప్రాంతాలతో పాటు బ్రెజిల్ కూడా ఈ అసాధారణ ఘటనను ప్రత్యక్షంగా అనుభవించనుంది. ఈ దీర్ఘ సూర్యగ్రహణంపై శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటంటే.. "సంపూర్ణ సూర్యగ్రహణం సాధారణంగా ప్రతి 18 నెలలకొకసారి సంభవిస్తుంది. కానీ 2027లో జరిగే ఈ గ్రహణం ప్రత్యేక ప్రాధాన్యం కలిగింది. 6 నిమిషాలకు పైగా కొనసాగడం వల్ల ఖగోళ శాస్త్ర పరిశోధనలు, ఉష్ణోగ్రతల మార్పులు, జంతువుల ప్రవర్తనలోని తేడాలపై అధ్యయనం చేయడానికి అరుదైన అవకాశం లభించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు, అంతరిక్ష సంస్థలు ఈ గ్రహణాన్ని ప్రత్యక్ష శాస్త్రీయ ప్రయోగశాలలా ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. అనేక ముఖ్య పరిశోధనలు చేయబడతాయి" అని వారు తెలిపారు.