Apple : ప్రపంచ ఐఫోన్లలో 25% భారత్‌లోనే.. యాపిల్ సరికొత్త రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో ఆపిల్ సంస్థ తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విక్రయించే ఐఫోన్లలో సుమారు 25 శాతం భారత్‌లోనే తయారవుతున్నాయని బ్లూమ్‌బెర్గ్ నివేదికలు వెల్లడించాయి. 2025లో దేశంలో ఐఫోన్ ఉత్పత్తి దాదాపు 53 శాతం పెరిగినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించిన భారీ సుంకాలను తప్పించుకోవడం కోసం యాపిల్ భారత్‌లో ఉత్పత్తిని పెంచుతున్నట్లు ఆ నివేదికలు సూచిస్తున్నాయి.
details
230 మిలియన్లు ఐఫోన్ల తయారీ
బ్లూమ్‌బెర్గ్ వివరాల ప్రకారం యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం గరిష్ఠంగా సుమారు 230 మిలియన్లు (23 కోట్లు) ఐఫోన్లను తయారు చేస్తుంది. 2024లో ఆ సంస్థ భారత్‌లో 36 మిలియన్ల ఐఫోన్లను అసెంబుల్ చేయగా, గత ఏడాది ఆ సంఖ్య 55 మిలియన్లకు (5.5 కోట్లు) పెరిగింది. భవిష్యత్తులో ఐఫోన్ తయారీలో భారత్ వాటా మరింత వేగంగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దేశీయ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక పథకం (PLI) ద్వారా యాపిల్ గత కొన్ని సంవత్సరాల్లో భారత్‌లో తన విస్తరణను మరింత వేగవంతం చేసింది.
details
ఎగుమతులను మరింతగా పెంచేందుకు కొత్త ప్రోత్సాహకాలు
అధిక లాజిస్టిక్స్ ఖర్చులు, ఇతర నిర్మాణాత్మక సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు కూడా కంపెనీకి సహాయపడుతున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ తయారీకి సంబంధించిన సబ్సిడీలు మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో ఎగుమతులను మరింతగా పెంచేందుకు కొత్త ప్రోత్సాహకాలు ఇవ్వాలనే అంశంపై యాపిల్ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై యాపిల్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.