నీరు తాగకున్నా ఈ మొక్కలు బతుకుతాయి
సాధారణంగా ఏ మొక్కలకైనా జీవించాలంటే నీరు తప్పనిసరి. కానీ వెస్ట్రన్ ఘాట్స్ లో ఉన్న కొన్ని ప్రత్యేక మొక్కలు మాత్రం నీటిని తీసుకోకున్నా జీవిస్తాయి. అయితే ఈ కోవకు చెందిన దాదాపు 62 రకాల జాతుల మొక్కలను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ గుర్తించింది. పశ్చిమ కనుమల్లో తీవ్ర నీటి ఎద్దడికి ఎదురీదుతూ బతికే జాతుల మొక్కలను గుర్తించినట్టు ఆ శాఖ వెల్లడించింది. డిసికేషన్ టాలరెంట్ వ్యాస్కూలర్ గా పిలిచే ఈ మొక్కలు, తమలోని 95 శాతం నీరు కోల్పోయినా జీవించే ఉంటాయని వివరించింది. ప్రొఫెసర్ మందార్ దాతార్ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరపగా, వాటి అధ్యయన ఫలితాలను నోర్డిక్ జర్నల్ ఆఫ్ బాటనీలో అచ్చు వేశారు.
నీటి లభ్యతతో మళ్లీ మామూలు స్థితిలోకి
ఈ మొక్కలపై చేసే పరిశోధనలు ఎడారి, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పంటల సాగుకు ఉపయోగపడతాయని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ స్పష్టం చేసింది. దీనిపై విస్తృత పరిశోధనలు జరుపనున్నామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 62 జాతుల్లో 16 జాతులు దేశంలోని స్థానిక జాతులకు చెందినవేనని సైంటిస్టులు అంచనాకు వచ్చారు. అందులోని 12 జాతులు పశ్చిమ కనుమల్లో మాత్రమే జీవిస్తాయన్నారు. పుణెలోని అఘార్కర్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సైంటిస్టులు తీవ్రమైన నీటి ఎద్దడి పరిస్థితులు ఎదురైన సందర్భంలో మొక్కలు నిద్రాణ స్థితికి చేరుకుంటున్నట్లు గుర్తించారు. నీటి లభ్యత పెరిగినప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితిలోకి వచ్చేస్తాయని వివరించారు.