సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు!
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు సూర్యునిపై భారీ నల్లటి ప్రాంతాన్ని గుర్తించింది. ఇది మన భూమి కంటే 20 రెట్లు పెద్దదని వైస్ న్యూస్ నివేదిక పేర్కొంది. ఈ భారీ నల్లని రంధ్రాన్ని 'కరోనల్ హోల్' అని పిలుస్తారు. కరోనల్ హోల్ అనేది భూ అయస్కాంత తుఫానుల హెచ్చరికను సూచిస్తుందని అమెరికాకు చెందిన ఎన్ఓఏఏ ఏజెన్సీ పేర్కొంది. సూర్యుడి ఉపరితలంపై నల్లటి హోల్ వల్ల భూమి వైపు 2.9 మిలియన్ కిమీల వేగంతో సౌర గాలులు వీస్తాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నెల 31నాటికి అవి భూమిని తాకే అవకాశం ఉందని www.news.com.au వెబ్ సైట్ పేర్కొంది.
సౌర గాలుల వల్ల ఉపగ్రహాలు, మొబైల్ ఫోన్‌లు, జీపీఎస్‌పై ప్రభావం
ఈ సౌర గాలులు భూమి మీద చూపే ప్రభావాన్ని అంచనా వేయడానికి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఎన్ఓఏఏ ఏజెన్సీ తెలిపింది. సూర్యుని నుంచి ప్రవహించే కణాల ప్రవాహం వల్ల భూమి అయస్కాంత క్షేత్రం, ఉపగ్రహాలు, మొబైల్ ఫోన్‌లు, జీపీఎస్ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. సూర్యుని దక్షిణ ధ్రువానికి సమీపంలో మార్చి 23న నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్‌డీఓ) కరోనల్ హోల్‌ను కనుగొంది. ప్రస్తుతం కనుగొన్న కరోనల్ రంధ్రం చాలా పెద్దదని, దాదాపు 300,000 నుంచి 400,000 కిలోమీటర్ల వరకు ఉంటుందని నాసా హీలియోఫిజిక్స్ సైన్స్ విభాగానికి చెందిన అలెక్స్ యంగ్ చెప్పారు. కరోనల్ రంధ్రాలు తీవ్ర అతినీలలోహిత(ఈయూవీ), మృదువైన ఎక్స్-రే సోలార్ చిత్రాల్లో చీకటి ప్రాంతాలుగా కనిపిస్తాయని నాసా పేర్కొంది.