మార్చి 25 నుంచి 30 మధ్య ఆకాశంలో అద్భుతం; ఓకే రాశిలో ఐదు గ్రహాలు
ఆకాశంలో ఒక అద్భుతం ఆవిష్కృతం కానుంది. మార్చి 25 నుంచి 30 మధ్య ఐదు గ్రహాలు ఒకే కక్ష్యలోకి రానున్నాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ ఒకే సెక్టార్‌లోకి వచ్చి కనువిందు చేస్తాయని స్టార్ వాక్ అనే వెబ్ సేట్ పేర్కొంది. మార్చి చివరి రోజుల్లో ఐదు గ్రహాలు ఒకదానికొకటి సమీపంలో కనిపిస్తాయి. మార్చి 28న ఐదు గ్రహాలు అత్యంత స్పష్టంగా దర్శనం ఇవ్వనున్నాయి. అయితే భూమిపై నుంచి వీటిని బైనాక్యూలర్ లేకుండానే చూడవచ్చు. అయితే వాటిని గుర్తించడమే కష్టం. సూర్యాస్తమయం తర్వాత, గ్రహాలు కలిసి పశ్చిమ హోరిజోన్‌లో ఆర్క్ ఆకారంలో కనివిందు చేయనున్నాయి.
శుక్ర గ్రహాన్ని గుర్తించడం చాలా సులభం
సూర్యుడు, చంద్రుల తర్వాత ఆకాశంలో మూడో అతి ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. దీన్ని గుర్తించడం చాలా సులభం. అయితే బుధుడు, యురేనస్‌ను మాత్రం గుర్తించడం చాలా కష్టం. అయితే వీటిని గుర్తించడానికి బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. బృహస్పతి, బుధుడు పక్కపక్కనే కనిపిస్తాయి. రెండు గ్రహాలు సూర్యాస్తమయం తర్వాత ఒక గంట కంటే తక్కువ సమయం మాత్రమే కనిపిస్తాయి. మార్చి చివరి రోజుల్లో అంగారక గ్రహం ఎక్కువసేపు కనిపిస్తుంది. ఇది ప్రకాశవంతమైన ఎరుపు రంగులో కనువిందు చేస్తుంది. నైరుతి ఆకాశంలో, చంద్రవంక పైన ఇది దర్శనమిస్తుంది. శుక్ర గ్రహం పైన ఎడమ వైపున యురేనస్ ఉంటుంది. ఈ రెండు గ్రహాలు సూర్యుడు అస్తమించిన తర్వాత దర్శనిమిస్తాయి.