మనకు తెలియకుండానే మైక్రోప్లాస్టిక్ కణాలను పీల్చేస్తున్నాం; అధ్యయనంలో షాకింగ్ నిజాలు
ప్లాస్టిక్ ఉత్పత్తుల నుంచి వెలువడే చిన్న కణాలు(మైక్రోప్లాస్టిక్) శ్వాసకోశ వ్యాధులతో పాటు, ఇతర తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన హెచ్చరించింది. ప్రతి మనిషి గంటకు 16.2 బిట్‌ల మైక్రోప్లాస్టిక్‌ను పీల్చుకుంటున్నారని పరిశోధకులు అంచనా వేశారు. అంటే ప్రతి ఒక్కరూ వారానికి ఒక క్రెడిట్ కార్డులో వినియోగించే అంత మైక్రోప్లాస్టిక్‌ను పీల్చుకుంటున్నారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మైక్రోప్లాస్టిక్‌లు అంటే చిన్న ప్లాస్టిక్ కణాలు. ఇవి చూడటానికి 5మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. వ్యక్తిగత సంరక్షణకు ఉపయోగించే ఉత్పత్తులైన మైక్రోబీడ్‌లు, సింథటిక్ వస్త్రాలు, మైక్రోఫైబర్‌లు, ప్లాస్టిక్ వస్తువుల విచ్ఛిన్నం ఫలితంగా మైక్రోప్లాస్టిక్ కణాలు ఏర్పడుతుంటాయి.
నీరు, గాలి, నేలలో మిలియన్ల టన్నుల మైక్రోప్లాస్టిక్ కణాలు
గాలిలో మైక్రోప్లాస్టిక్ రవాణా, ఉనికిని గుర్తించి, విశ్లేషించడానికి పరిశోధకులు ఫ్లూయిడ్ డైనమిక్స్ మోడల్‌ను అభివృద్ధి చేశారు. మిలియన్ల టన్నుల మైక్రోప్లాస్టిక్ కణాలు నీరు, గాలి, నేలలో కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గ్లోబల్ మైక్రోప్లాస్టిక్ ఉత్పత్తి పెరుగుతోందని, గాలిలో మైక్రోప్లాస్టిక్‌ల సాంద్రత గణనీయంగా వృద్ధి చెందుతోందని పరిశోధకుడు మహ్మద్ ఇస్లాం చెప్పారు. 2022లో మొట్ట మొదటిసారిగా గాలిలో మైక్రోప్లాస్టిక్‌లు కణాలు ఉన్నట్లు కనుగొన్నట్లు వెల్లడించారు. మైక్రోప్లాస్టిక్‌లు తీవ్రమైన శ్వాసకోశ, అనారోగ్యాలను కలిగిస్తున్నాయని ఇస్లాం వివరించారు. మైక్రోప్లాస్టిక్‌లు హానికరమైన రసాయనాలు, టాక్సిన్స్‌కు వాహకాలుగా కూడా పనిచేస్తాయని అధ్యయనం చెబుతోంది. మైక్రోప్లాస్టిక్‌లకు శరీరంలో నాసికా కుహరం, ఒరోఫారింక్స్ లేదా గొంతు వెనుక భాగంలో హాట్ స్పాట్‌లుగా ఉన్నాయని, అవి ఈ ప్రదేశాల్లోనే నిల్వ ఉంటాయని పరిశోధకులు గుర్తించారు.