LOADING...
Shubhanshu Shukla: 25న అంతరిక్షానికి శుభాంశు శుక్లా.. యాక్సియం-4 మిషన్‌ ఖరారు!
25న అంతరిక్షానికి శుభాంశు శుక్లా.. యాక్సియం-4 మిషన్‌ ఖరారు!

Shubhanshu Shukla: 25న అంతరిక్షానికి శుభాంశు శుక్లా.. యాక్సియం-4 మిషన్‌ ఖరారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర తేదీ ఖరారైంది. యాక్సియం-4 (Ax-4) మిషన్‌ కింద ఆయన ఈనెల 25న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పయనంకానున్నారు. ఈ విషయాన్ని మంగళవారం నాసా అధికారికంగా ప్రకటించింది. నాసా తెలిపిన వివరాల ప్రకారం, యాక్సియం-4 మిషన్‌ ప్రయోగం జూన్‌ 25న మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) జరగనుంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి రాకెట్‌ నింగిలోకి ఎగురనుంది. గురువారం సాయంత్రం 4:30 గంటలకు (భారత కాలమానం) వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అవుతుందని నాసా తెలిపింది. ఈ మిషన్‌ కింద శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ప్రయాణిస్తారు.

Details

మిషన్ పైలట్ గా శుంభాంశు శుక్లా

అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ 'యాక్సియం స్పేస్‌' ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఈ యాత్రలో భాగస్వామ్యం అవుతున్నారు. యాక్సియం-4 మిషన్‌ కింద అంతరిక్షానికి వెళ్లే ఈ వ్యోమక్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ మోసుకెళ్తుంది. శుభాంశు శుక్లా మిషన్‌ పైలట్‌గా వ్యవహరిస్తారు.

Details

జూన్ 25న ఖరారు

మొదట ఈ ప్రయోగాన్ని మే 29న జరపాలని నిర్ణయించినా, అననుకూల వాతావరణం, సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడి చివరికి జూన్‌ 25న ఖరారయింది. భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత శుభాంశుతో పాటు మిగతా వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారు 14 రోజుల పాటు భారరహిత పరిస్థితుల్లో పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అంతరిక్షం నుంచి ముచ్చటిస్తారు.