LOADING...
Google AI: గూగుల్‌లో ఏఐ బ్రెయిన్ డ్రెయిన్‌.. ఆంథ్రోపిక్‌ బాట పట్టనున్న మరో ఇద్దరు నిపుణులు
ఆంథ్రోపిక్‌ బాట పట్టనున్న మరో ఇద్దరు నిపుణులు

Google AI: గూగుల్‌లో ఏఐ బ్రెయిన్ డ్రెయిన్‌.. ఆంథ్రోపిక్‌ బాట పట్టనున్న మరో ఇద్దరు నిపుణులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో సంస్థకు చెందిన కీలక నిపుణులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐ వంటి స్టార్టప్ కంపెనీలు గూగుల్‌కు గట్టి సవాల్ విసురుతున్నాయి. ఇటీవల ఇద్దరు ప్రముఖ పరిశోధకులు సంస్థను వీడగా, ఇప్పుడు మరో ఇద్దరు కూడా గూగుల్‌కు రాజీనామా చేసి ఆంథ్రోపిక్‌లో చేరనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

వివరాలు 

సంస్థను వీడనున్న జోనాస్ ఆడ్లర్,అలెగ్జాండర్ ప్రిట్జెల్

గూగుల్ జెమినై ఏఐ మోడల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన జోనాస్ ఆడ్లర్, అలెగ్జాండర్ ప్రిట్జెల్ త్వరలో ఆంథ్రోపిక్‌లో చేరనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జోనాస్ ఆడ్లర్ ప్రస్తుతం గూగుల్‌లో ఏఐ కోడింగ్ విభాగంలో పనిచేస్తుండగా, అలెగ్జాండర్ ప్రిట్జెల్ ఏఐ సిస్టమ్స్ శిక్షణ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గూగుల్ ఏఐ పరిశోధనలో కీలకంగా వ్యవహరించిన నోబెల్ బహుమతి గ్రహీత జాన్ జంపర్ ఆంథ్రోపిక్‌లో చేరారు. మరో ప్రముఖ పరిశోధకుడు నోమ్ షాజీర్ ఇటీవల ఓపెన్‌ఏఐలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జోనాస్ ఆడ్లర్, అలెగ్జాండర్ ప్రిట్జెల్ కూడా సంస్థను వీడనున్నారనే సమాచారం గూగుల్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వివరాలు 

ఐపీఓల దిశగా స్టార్టప్‌లు..పెరుగుతున్న ఉద్యోగుల వలసలు

ఈ కీలక నిపుణుల నిష్క్రమణతో గూగుల్ ఏఐ మోడళ్ల అభివృద్ధి వేగంపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల ప్రభావంతో బుధవారం గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ షేర్లు సుమారు 1.2 శాతం వరకు క్షీణించాయి. ఏఐ రంగంలో ప్రారంభం నుంచే ముందంజలో ఉన్న గూగుల్‌కు గత ఏడాది నుంచి ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి స్టార్టప్ కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ సంస్థలు త్వరలోనే పబ్లిక్ ఇష్యూలు (ఐపీఓలు) తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో భవిష్యత్తులో భారీ ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తుండటంతో పలువురు ఏఐ పరిశోధకులు ఆ సంస్థల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

వివరాలు 

అధికారిక ప్రకటన చేయని గూగుల్,ఆంథ్రోపిక్

అదే సమయంలో పరిశోధకుల కెరీర్ ప్రాధాన్యాలు మారడం కూడా గూగుల్ నుంచి ఉద్యోగులు వెళ్లడానికి మరో కారణంగా భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై గూగుల్ గానీ, ఆంథ్రోపిక్ గానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఉద్యోగుల వలసలపై స్పందించిన గూగుల్ డీప్‌మైండ్ సీఈవో డెమిస్ హస్సాబిస్, ప్రస్తుతం టెక్ పరిశ్రమలో ప్రతిభావంతులైన నిపుణుల కోసం గతంలో ఎప్పుడూ లేనంత తీవ్ర పోటీ నెలకొందని తెలిపారు. అయినప్పటికీ ఇతర ఏఐ ల్యాబ్‌లతో పోలిస్తే అత్యంత పెద్దదైన, ప్రతిభావంతులైన బృందం తమ వద్దనే కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement