
AI Content: ఏఐ కంటెంట్ నియంత్రణ.. క్రియేటర్లకు లైసెన్స్ తప్పనిసరి: పార్లమెంటరీ కమిటీ సిఫారసు
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సృష్టించబడుతున్న నకిలీ వార్తలు, డీప్‌ఫేక్‌లు దేశంలో వైరల్‌గా వ్యాప్తి చెందుతున్న సమస్యను అరికట్టడానికి పార్లమెంటరీ స్థాయీ సంఘం కీలకమైన సిఫారసులు చేసింది. ఏఐ కంటెంట్‌ను సృష్టించేవారికి తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని, లైసెన్స్ లేకుండా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠినంగా శిక్ష విధించాలని సూచించింది. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే నేతృత్వంలోని కమ్యూనికేషన్స్, ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ నివేదికను ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఏది అసలు ఫొటో, ఏది ఏఐ సృష్టించినదో గుర్తించడం చాలా కష్టం. ఇదే అంశాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు తప్పుడు ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారు
Details
పటిష్టమైన నిబంధనలు అవసరం
. సమస్య తీవ్రతను పరిగణించిన కమిటీ, దీన్ని నియంత్రించేందుకు పటిష్ఠమైన నిబంధనలు అవసరమని పేర్కొంది. లైసెన్స్ కలిగినవారు మాత్రమే ఏఐతో కంటెంట్ రూపొందించగలిగే విధంగా నిబంధనలు రూపొందించాలి, ఇది జవాబుదారీతనాన్ని పెంచుతుందని సూచించింది. ఇంకా, ఏఐ ద్వారా రూపొందించిన ప్రతి ఫొటో, వీడియో లేదా వార్తా కథనానికి "ఏఐతో రూపొందించబడింది" అనే స్పష్టమైన ట్యాగ్‌ను జత చేయాలని కమిటీ సిఫారసు చేసింది. దీని ద్వారా ప్రజలు ఏది నిజమైన సమాచారం, ఏది కృత్రిమంగా సృష్టించబడిందో సులభంగా గుర్తించగలుగుతారు. కమిటీ సిఫారసులను చట్టరూపంలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి మరియు ఆమోదం పొందాల్సి ఉంటుంది.