Page Loader
AI: 2030 నాటికి ఏఐకి మానవుడిలాంటి మేధస్సు.. 'మానవాళిని నాశనం చేయగలదు' : గూగుల్ అంచనా  
2030 నాటికి ఏఐకి మానవుడిలాంటి మేధస్సు

AI: 2030 నాటికి ఏఐకి మానవుడిలాంటి మేధస్సు.. 'మానవాళిని నాశనం చేయగలదు' : గూగుల్ అంచనా  

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కృత్రిమ మేధస్సు మాయే కనిపిస్తోంది. ఇది ప్రతి రంగంలోను విప్లవాత్మక మార్పులకు కారణమవుతూ, మనిషి జీవితాన్ని మారుస్తోంది. ఇదివరకెన్నడూ లేనంతగా సౌలభ్యాలు అందిస్తున్నప్పటికీ, దీని వల్ల ఎదురయ్యే ప్రమాదాలను కూడా మరిచిపోలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచాన్ని శాశ్వతంగా ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న మానవ స్థాయి కృత్రిమ మేధస్సు - ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (Artificial General Intelligence - AGI) 2030 కల్లా అందుబాటులోకి వస్తుందని, ఇది మానవాళికి పెద్ద ముప్పుగా మారవచ్చని గూగుల్ డీప్‌మైండ్ (Google DeepMind) తాజా పరిశోధన హెచ్చరిస్తోంది.

వివరాలు 

మానవాళిని నాశనం చేసే స్థాయికి AGI 

AGI వల్ల సంభవించే భారీ ప్రభావాల దృష్ట్యా, ఇది తీవ్రంగా హాని చేసే అవకాశముందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇది మానవాళిని నాశనం చేసే స్థాయికి వెళ్లొచ్చని తాము అంచనా వేసినట్టు పరిశోధకులు తెలిపారు. అధునాతన ఏఐల వల్ల వచ్చే ముప్పులను పలు విభాగాలుగా ఈ అధ్యయనం వర్గీకరించింది.. డేటా దుర్వినియోగం, తప్పులు జరిగే అవకాశాలు, తప్పుడు సమాచార పంపిణీ, వ్యవస్థాపిత ప్రమాదాలు (structural risks) వంటి అంశాలపై స్పష్టంగా వివరణ ఇచ్చింది. ఈ అధ్యయనానికి డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు షేన్ లెగ్ సహ రచయితగా ఉన్నారు. అయితే ఇది ఏ విధంగా మానవాళికి నష్టాన్ని కలిగించగలదనే అంశాన్ని పూర్తి వివరంగా స్పష్టం చేయలేదు.

వివరాలు 

AI సంస్థలు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సిఫార్సులు

కానీ, ఈ ముప్పును తగ్గించేందుకు గూగుల్, ఇతర AI సంస్థలు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సిఫార్సులు చేసింది. గత ఫిబ్రవరిలో డీప్‌మైండ్ సీఈవో డెమిస్ హస్సాబిస్ మాట్లాడుతూ - మనుషుల కంటే మెరుగైన మేధస్సు కలిగిన AGI తక్కువ కాలంలోనే ఉద్భవించబోతుందని చెప్పారు. అయిదు నుంచి పది సంవత్సరాల్లో ఇది రూపుదిద్దుకోగలదని అంచనా వేశారు. AGIపై పర్యవేక్షణ ఉండేలా ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

వివరాలు 

AGI అంటే ఏమిటి? 

కృత్రిమ మేధస్సులో మరో మెట్టు - AGI. సాధారణంగా ఏఐ ఒక నిర్దిష్ట పని కోసం మాత్రమే రూపొందించబడుతుంది. కానీ, AGI అంటే - మానవ మేధస్సు మాదిరిగా విభిన్న రంగాలలో పని చేయగల, నేర్చుకునే, అర్థం చేసుకునే, అన్వయించగల సార్వత్రిక మేధస్సు కలిగిన యంత్రబుద్ధి. ఇది మనుషుల్లా విభిన్న విషయాలను అర్థం చేసుకుని, పరిష్కారాలను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.