LOADING...
Year Ender 2025 : ఏఐ విప్లవం.. ఈ ఏడాది మానవ జీవనాన్ని మార్చేసిన సంచలన ఆవిష్కరణలు ఇవే 
ఏఐ విప్లవం.. ఈ ఏడాది మానవ జీవనాన్ని మార్చేసిన సంచలన ఆవిష్కరణలు ఇవే

Year Ender 2025 : ఏఐ విప్లవం.. ఈ ఏడాది మానవ జీవనాన్ని మార్చేసిన సంచలన ఆవిష్కరణలు ఇవే 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధస్సు (AI) చరిత్రలో 2025 ఒక కీలకమైన మైలురాయిగా నిలిచిపోనుంది. గడిచిన 12 నెలల్లో ఏఐ కేవలం ఒక శక్తిమంతమైన సాధనంగా మాత్రమే కాకుండా మన దైనందిన జీవితం, ఆర్థిక వ్యవస్థ, పాలన, శాస్త్రీయ పరిశోధనలలో విడదీయరాని భాగంగా మారిపోయిన విషయం తెలిసిందే. సిలికాన్ వ్యాలీ నుంచి బీజింగ్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలు సరికొత్త ఏఐ మోడల్స్‌ను ఆవిష్కరిస్తూ యంత్ర మేధస్సు సామర్థ్యాల సరిహద్దులను చెరిపేశాయి. అదే సమయంలో ఈ సాంకేతికతతోపాటు ఉద్భవిస్తున్న నైతిక, భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల నాయకులు సిద్ధమయ్యారు. ఈ ప్రత్యేక కథనంలో 2025లో ఏఐ రంగంలో చోటు చేసుకున్న ప్రధాన ఆవిష్కరణలు, అంతర్జాతీయ పోటీ, నైతిక చర్చలను సమగ్రంగా పరిశీలిద్దాం.

Details

సరికొత్త ఏఐ మోడల్స్ ఆవిష్కరణ 

2025 ప్రారంభంలో ఓపెన్‌ఏఐ (OpenAI) విడుదల చేసిన GPT-5మోడల్, ఏఐ సామర్థ్యాలకు కొత్త ప్రమాణాలను నిర్దేశించింది. GPT-4తో పోలిస్తే ఇది మెరుగైన తార్కిక నైపుణ్యాలు, విస్తృత మెమరీ, ఆధునిక మల్టీమోడల్ సామర్థ్యాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. టెక్స్ట్, ఇమేజ్, వీడియోలను ఒకేసారి అర్థం చేసుకోవడమే కాకుండా లక్షల పదాల డాక్యుమెంట్లు, క్లిష్టమైన కోడింగ్, లైవ్ వీడియో స్ట్రీమ్‌లను కూడా విశ్లేషించగల సామర్థ్యం దీని ప్రత్యేకత. ఈ పురోగతితో చాట్‌జీపీటీ తన అగ్రస్థానాన్ని మరింత బలపరిచింది. మరోవైపు గూగుల్ డీప్‌మైండ్ (Google DeepMind)2025 చివర్లో విడుదల చేసిన Gemini-3మోడల్ GPT-5కు గట్టి పోటీగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, సాఫ్ట్‌వేర్‌లలో వాస్తవ ప్రపంచంలో స్వయంగా పనులు చేసే 'ఏజెంట్' సామర్థ్యాన్ని ఇది ప్రదర్శించింది.

Details

 అత్యుత్తమ మోడల్ గా గుర్తింపు

శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థ విడుదల చేసిన Claude-4.5 కూడా ఈ ఏడాది ప్రత్యేకంగా నిలిచింది. కోడింగ్, ఏఐ ఏజెంట్స్, కంప్యూటర్ వినియోగంలో ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ మోడల్‌గా గుర్తింపు పొందింది. ఒకేసారి 10 లక్షల టోకెన్లకు పైగా —అంటే దాదాపు ఒక లైబ్రరీలోని పుస్తకాలంత సమాచారాన్ని—ప్రాసెస్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఇక మెటా (Meta) తన ఓపెన్ సోర్స్ వ్యూహాన్ని కొనసాగిస్తూ Llama-3, Llama-4 మోడల్స్‌ను విడుదల చేసింది. 405 బిలియన్ పారామీటర్లతో వచ్చిన Llama-4, అత్యాధునిక ఏఐ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

Details

ఓపెన్ సోర్స్ ఏఐలో పెరిగిన ప్రపంచ పోటీ 

2025లో ఏఐ అభివృద్ధి ప్రపంచీకరణను స్పష్టంగా ప్రతిబింబించింది. ముఖ్యంగా ఓపెన్ సోర్స్ ఏఐ రంగంలో చైనా వేగంగా ముందుకు దూసుకువచ్చింది. ఇప్పటివరకు ఈ రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగగా, బీజింగ్‌కు చెందిన డీప్‌సీక్ (DeepSeek) సంస్థ తన 'DeepSeek-R1' మోడల్‌ను ఉచితంగా విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఇది అంతర్జాతీయ ఏఐ లీడర్‌బోర్డుల్లో రెండో స్థానానికి చేరి, అమెరికా టెక్ కంపెనీలను ఆశ్చర్యానికి గురి చేసింది. డీప్‌సీక్ బాటలోనే అలీబాబా, టెన్సెంట్ వంటి చైనా దిగ్గజాలు కూడా తమ ఓపెన్ సోర్స్ మోడల్స్‌ను విడుదల చేశాయి. ఫలితంగా 2025 చివరి నాటికి ఓపెన్ సోర్స్ ఏఐలో చైనా ప్రపంచ నాయకుడిగా అవతరించింది.

Advertisement

Details

అందరి జీవితాల్లోకి ఏఐ 

ఈ ఏడాది ఏఐ ప్రయోగశాలలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆఫీసు పనుల నుంచి స్మార్ట్‌ఫోన్ల వరకు ప్రతిచోటా విస్తరించింది. Microsoft 365Copilotసాయంతో లక్షలాది మంది ఉద్యోగులు ఈమెయిల్స్ రాయడం, మీటింగ్‌లను సంగ్రహించడం, ప్రజెంటేషన్లు తయారు చేయడం మరింత సులభంగా చేస్తున్నారు. గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో Search Generative Experience(SGE)ను పూర్తిస్థాయిలో అమలు చేసింది. ఇకపై గూగుల్ కేవలం లింకులు ఇవ్వడం కాకుండా సంభాషణ రూపంలో నేరుగా సమాధానాలు అందిస్తోంది. Geminiయాప్, అలాగే Android-16లో ప్రవేశపెట్టిన ఏఐ ఫీచర్లు వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించాయి. యాపిల్ కూడా 'Apple Intelligence 2.0'తో ఈ పోటీలో చేరింది.యూజర్ల డేటా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఐఫోన్లు, మ్యాక్‌లలోనే నేరుగా పనిచేసే ఆన్-డివైస్ ఏఐని పరిచయం చేసింది.

Details

శాస్త్ర, వైద్య రంగాల్లో ఏఐ విప్లవం 

వాణిజ్య వినియోగంతో పాటు శాస్త్రం, వైద్యంలో ఏఐ ప్రభావం అపారంగా పెరిగింది. గూగుల్ డీప్‌మైండ్ అభివృద్ధి చేసిన ఏఐ టూల్స్ కొత్త క్యాన్సర్ చికిత్సా మార్గాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి. ట్యూమర్ డీఎన్ఏను విశ్లేషించి, క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యు ఉత్పరివర్తనాలను ఏఐ విజయవంతంగా గుర్తించింది. అలాగే గణితంలో కొత్త సిద్ధాంతాల అన్వేషణ, వాతావరణ మార్పుల అంచనా వంటి రంగాల్లో కూడా ఏఐ కీలకంగా మారింది. వరదలను ముందుగానే గుర్తించే గూగుల్ ఏఐ వ్యవస్థ ప్రస్తుతం 150 దేశాల్లో 200 కోట్ల మందికి పైగా ప్రజలకు సేవలు అందిస్తోంది.

Details

భౌగోళిక రాజకీయాలు, నైతిక సవాళ్లు 

ఏఐ అభివృద్ధి వేగంగా సాగుతున్న కొద్దీ, దాని వల్ల తలెత్తే సవాళ్లు కూడా అంతే తీవ్రంగా మారాయి. ఏఐ ఆధిపత్యం కోసం దేశాల మధ్య పోటీ పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'Winning the Race' నినాదంతో భారీ ఏఐ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టగా యూరోపియన్ యూనియన్ కఠినమైన ఏఐ చట్టాలను అమలు చేసింది. ఈ ఏడాది టెక్ కంపెనీలు ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై సుమారు 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఇది ఒక 'ఏఐ బబుల్'కు దారితీయవచ్చనే ఆందోళనలను కూడా పెంచింది. అదే సమయంలో నైతిక సమస్యలు తీవ్ర చర్చకు వచ్చాయి.

Details

ధైర్యం చెప్పకుండా ఆత్మహత్యకు ప్రోత్సహించింది

న్యూయార్క్‌లో ఒక యువకుడు మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడిన అనంతరం ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. చాట్‌బాట్ అతడికి ధైర్యం చెప్పాల్సింది పోయి, ఆత్మహత్య ఆలోచనలను ప్రోత్సహించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన ఏఐ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం, కాపీరైట్ ఉల్లంఘనలు వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి.

Details

మొత్తంగా చెప్పాలంటే 

GPT-5, Gemini-3 వంటి అద్భుతమైన మోడల్స్ ఆవిష్కరణ నుంచి, చైనా ఓపెన్ సోర్స్ ఆధిపత్యం వరకు—2025 ఏఐ ప్రయాణంలో ఒక అసాధారణమైన సంవత్సరం. ఏఐ ఇప్పుడు మన జీవితంలో విడదీయరాని శక్తిగా మారింది. అయితే, ఈ అపారమైన శక్తితో పాటు అంతే గొప్ప బాధ్యత కూడా వస్తుందని ఈ ఏడాది స్పష్టంగా తెలియజేసింది. ఏఐ మానవాళికి మేలు చేస్తుందా లేదా అనేది మన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. 2025లో జరిగిన ఆవిష్కరణలు ఆ భవిష్యత్ చర్చకు బలమైన వేదికను సిద్ధం చేశాయి.

Advertisement