LOADING...
Amazon vs Perplexity: పెర్‌ప్లెక్సిటీకి అమెజాన్‌ లీగల్‌ నోటీసులు.. స్పందించిన సీఈఓ 
పెర్‌ప్లెక్సిటీకి అమెజాన్‌ లీగల్‌ నోటీసులు.. స్పందించిన సీఈఓ

Amazon vs Perplexity: పెర్‌ప్లెక్సిటీకి అమెజాన్‌ లీగల్‌ నోటీసులు.. స్పందించిన సీఈఓ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏఐ టెక్‌ సంస్థ పెర్‌ప్లెక్సిటీ (Perplexity) తయారు చేసిన వెబ్‌బ్రౌజర్‌ 'కామెట్‌' (Comet) విషయంలో ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) లీగల్‌ నోటీసులు జారీ చేసింది. కామెట్‌ బ్రౌజర్‌ సహాయంతో తమ ప్లాట్‌ఫామ్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశాన్ని తక్షణమే నిలిపివేయాలని అమెజాన్‌ సూచించింది. దీనిపై పెర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్‌ శ్రీనివాస్ స్పందిస్తూ, "అమెజాన్‌తో సహకారం ఇరు సంస్థలకు ఉపయోగకరం అవుతుంది. కానీ కామెట్‌ అసిస్టెంట్‌ను అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌లో నిరోధించడం వినియోగదారుల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుంది" అని స్పష్టం చేశారు.

వివరాలు 

ఏమిటీ వివాదం? 

పెర్‌ప్లెక్సిటీ తయారు చేసిన కామెట్‌ వెబ్‌బ్రౌజర్‌లో ఉన్న ఏఐ ఏజెంట్‌ యూజర్‌ తరఫున వివిధ వెబ్‌సైట్లలో వెతికి, ఉత్పత్తులను ఎంపిక చేసి, ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు కూడా చేస్తుంది. అయితే, ఈ విధానాన్ని తమ నిబంధనలకు విరుద్ధమని అమెజాన్‌ పేర్కొంటూ పలుమార్లు హెచ్చరించింది. స్పందన లేకపోవడంతో ఇటీవల అధికారిక లీగల్‌ నోటీసులు జారీ చేసి, అమెజాన్‌ సైట్‌లో కామెట్‌ అసిస్టెంట్‌ పనిచేయకుండా ఆపాలని స్పష్టం చేసింది. పెర్‌ప్లెక్సిటీ కూడా ఈ నోటీసులను అందుకున్నట్లు ధృవీకరించింది. అమెజాన్‌ తన నోటీసుల్లో, కామెట్‌ ఏఐ ఏజెంట్‌ వల్ల వినియోగదారులకు సరైన కొనుగోలు సూచనలు (పర్సనలైజ్డ్‌ రికమెండేషన్లు) అందడం లేదని పేర్కొంది.

వివరాలు 

వినియోగదారుల ప్రయోజనాల కోసం తమ సంస్థ పనిచేస్తుంది

అంతేకాకుండా, యూజర్ల తరఫున కొనుగోలు చేసే సమయంలో ఆ ఏఐ తనను స్పష్టంగా ఏఐ ఏజెంట్‌గా గుర్తించకపోవడం తమ నిబంధనలకు వ్యతిరేకమని తెలిపింది. దీనికి ప్రతిస్పందిస్తూ పెర్‌ప్లెక్సిటీ, ఇది వినియోగదారుల స్వేచ్ఛపై, ఇంటర్నెట్‌ వినియోగ హక్కులపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించింది. కామెట్‌ ద్వారా షాపింగ్‌ చేసినా యూజర్ల వ్యక్తిగత డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేస్తూ, వినియోగదారుల ప్రయోజనాల కోసం తమ సంస్థ పనిచేస్తుంది అని తెలిపింది.