Amazon Prime: ఇక యాడ్స్ లేకుండా చూడాలంటే ఖర్చే ఖర్చు..!
ఈ వార్తాకథనం ఏంటి
స్ట్రీమింగ్ సేవల్లో కీలకమైన అమెజాన్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ లేకుండా చూడాలంటే ఇకపై వినియోగదారులు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీ మార్చి 13న ప్రకటించిన వివరాల ప్రకారం.. అమెరికాలో యాడ్-ఫ్రీ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ధరను నెలకు 2 డాలర్లు పెంచింది. ఇప్పటివరకు నెలకు 2.99 డాలర్లుగా ఉన్న యాడ్-ఫ్రీ ప్రైమ్ వీడియో ధరను 4.99 డాలర్లకు పెంచింది. అంటే దాదాపు రెట్టింపు ధరగా మారింది. అంతేకాదు, ఈ కొత్త యాడ్-ఫ్రీ ప్లాన్‌కు "ప్రైమ్ వీడియో అల్ట్రా " అనే పేరు కూడా ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
వివరాలు
వినియోగదారులకు షాక్
యాడ్స్ లేకుండా ప్రీమియం ఫీచర్లతో స్ట్రీమింగ్ అందించడానికి భారీ పెట్టుబడులు అవసరమవుతాయని, అందుకే ఈ కొత్త ధర విధానాన్ని అమలు చేస్తున్నామని అమెజాన్ వెల్లడించింది. అలాగే వినియోగదారులు తమకు నచ్చిన విధంగా సేవలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండేలా ఈ మార్పులు చేస్తున్నామని కంపెనీ తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఖరీదైన సబ్‌స్క్రిప్షన్‌లో కొన్ని అదనపు ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు ఒకేసారి ఐదు పరికరాల్లో ప్రైమ్ వీడియో చూడగలిగే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు 4K స్ట్రీమింగ్ అన్ని ప్రైమ్ వీడియో వినియోగదారులకు అందుబాటులో ఉండేది. ఇకపై అది 4.99 డాలర్ల ప్లాన్ తీసుకున్నవారికే పరిమితం కానుంది.