LOADING...
Anthropic: అలీబాబాపై అతిపెద్ద ఏఐ టెక్నాలజీ చోరీ ఆరోపణలు
అలీబాబాపై అతిపెద్ద ఏఐ టెక్నాలజీ చోరీ ఆరోపణలు

Anthropic: అలీబాబాపై అతిపెద్ద ఏఐ టెక్నాలజీ చోరీ ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఆంత్రోపిక్ చైనా టెక్ దిగ్గజం అలీబాబాపై సంచలన ఆరోపణలు చేసింది. తమ క్లాడ్ (Claude) ఏఐ మోడళ్ల సామర్థ్యాలను అక్రమంగా కాపీ చేసేందుకు అలీబాబా ప్రయత్నించిందని పేర్కొంది. ప్రపంచంలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అతిపెద్ద ఏఐ మేధోసంపత్తి చోరీ ప్రయత్నం ఇదేనని ఆ సంస్థ ఆరోపించింది. ఈ ఘటన అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న సాంకేతిక పోటీ నేపథ్యంలో మేధోసంపత్తి భద్రతపై మరోసారి ఆందోళనలు రేకెత్తించింది.

వివరాలు 

2.88 కోట్లకు పైగా ఇంటరాక్షన్లు

ఆంత్రోపిక్ వెల్లడించిన వివరాల ప్రకారం,అలీబాబా, దాని ఏఐ పరిశోధనా విభాగం క్వెన్ (Qwen)కు చెందిన ఆపరేటర్లు ఈ ఏడాది ఏప్రిల్ 22 నుంచి జూన్ 5 వరకు భారీ స్థాయిలో "డిస్టిలేషన్" కార్యక్రమం నిర్వహించినట్లు గుర్తించింది. ఇందుకోసం దాదాపు 25 వేల నకిలీ ఖాతాలను ఉపయోగించి క్లాడ్ ప్లాట్‌ఫామ్‌తో 2.88 కోట్లకు పైగా ఇంటరాక్షన్లు జరిపినట్లు తెలిపింది. తమ టెక్నాలజీని కాపీ చేసేందుకు ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద డిస్టిలేషన్ ప్రయత్నం ఇదేనని పేర్కొంది.

వివరాలు 

డిస్టిలేషన్ అంటే ఏమిటి?

డిస్టిలేషన్ అనేది శక్తివంతమైన ఏఐ మోడల్ ఇచ్చే సమాధానాలను ఆధారంగా తీసుకుని మరో చిన్న లేదా తక్కువ సామర్థ్యం గల ఏఐ మోడల్‌కు శిక్షణ ఇవ్వడం. సాధారణంగా కంపెనీలు తమ వ్యవస్థల పనితీరును మెరుగుపర్చేందుకు ఈ విధానాన్ని అంతర్గతంగా ఉపయోగిస్తాయి. అయితే కొందరు సంస్థలు అనుమతి లేకుండానే ఇతర సంస్థల సాంకేతిక సామర్థ్యాలను కాపీ చేసేందుకు కూడా దీనిని ఉపయోగిస్తున్నాయని ఆంత్రోపిక్ ఆరోపించింది. ఈ విధానాన్ని "అడ్వర్సరీయల్ డిస్టిలేషన్"గా పేర్కొంటూ, తక్కువ ఖర్చుతో పోటీ చాట్‌బాట్‌లను రూపొందించేందుకు చైనాకు చెందిన కొన్ని ఏఐ ల్యాబ్‌లు దీన్ని వినియోగిస్తున్నాయని తెలిపింది.

Advertisement

వివరాలు 

మిథోస్ ప్రివ్యూ సామర్థ్యాలే లక్ష్యమా?

తమ అత్యాధునిక ఏఐ వ్యవస్థల్లో ఒకటైన "మిథోస్ ప్రివ్యూ" మోడల్ స్థాయి సామర్థ్యాలను త్వరగా అందుకోవడమే ఈ డిస్టిలేషన్ కార్యక్రమం లక్ష్యమని ఆంత్రోపిక్ పేర్కొంది. ఈ ఆరోపణలను జూన్ 10న అమెరికా సెనేటర్లు టిమ్ స్కాట్, ఎలిజబెత్ వారెన్‌లకు పంపిన లేఖలో వివరించినట్లు వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జాతీయ భద్రతపై జరిగిన విచారణకు ముందే ఈ వివరాలను అందించినట్లు తెలిపింది.

Advertisement

వివరాలు 

అమెరికా ఏఐ సామర్థ్యాలను అక్రమంగా సేకరిస్తున్నారని ఆరోపణ

తమ లేఖలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఏఐ ల్యాబ్‌ల సాంకేతిక సామర్థ్యాలను అక్రమంగా, వ్యవస్థీకృతంగా, భారీ స్థాయిలో సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆంత్రోపిక్ ఆరోపించింది. అనంతరం వాటిని చైనా కంపెనీల సొంత ఉత్పత్తులుగా మార్చి విడుదల చేస్తున్నారని, అయితే అసలు మోడళ్ల అభివృద్ధికి అవసరమైన పరిశోధన, శిక్షణ వ్యయాలను మాత్రం భరించడం లేదని పేర్కొంది. ఈ తరహా చర్యలపై అమెరికా వైట్‌హౌస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కార్యాలయ డైరెక్టర్ మైఖేల్ క్రాట్సియోస్ కూడా ఏప్రిల్‌లో హెచ్చరించిన విషయం గుర్తు చేసింది.

వివరాలు 

ఇదే మొదటిసారి కాదు

ఇదే తరహా ఆరోపణలను ఆంత్రోపిక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా చేసింది. అప్పట్లో విడుదల చేసిన బ్లాగ్‌లో చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్‌సీక్‌తో పాటు మరికొన్ని చైనా ఏఐ సంస్థలు క్లాడ్ సామర్థ్యాలను కాపీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. ఇటువంటి ప్రయత్నాలు క్రమంగా మరింత అధునాతనంగా, తరచుగా జరుగుతున్నాయని, వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు, ఏఐ రంగం కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది.

వివరాలు 

చర్యలకు సిద్ధమైన అమెరికా చట్టసభ సభ్యులు

ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా చట్టసభ సభ్యులు కూడా చర్యలకు సిద్ధమవుతున్నారు. టెన్నెస్సీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ బిల్ హాగెర్టీ, న్యూజెర్సీకి చెందిన డెమొక్రాట్ సెనేటర్ ఆండీ కిమ్ రక్షణ చట్టంలో సవరణ తీసుకురావాలని యోచిస్తున్నారు. అమెరికా ఏఐ మోడళ్ల ఫలితాలను అక్రమంగా ఉపయోగించి పోటీ మోడళ్లకు శిక్షణ ఇచ్చినట్లు తేలితే సంబంధిత చైనా కంపెనీలపై ఆంక్షలు లేదా బ్లాక్‌లిస్ట్ చర్యలు తీసుకునేలా ఈ ప్రతిపాదన ఉండనుంది. దీంతో ఏఐ అభివృద్ధి, జాతీయ భద్రత అంశాలు మరింత దగ్గరగా ముడిపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement