Anthropic: xAIతో భారీ ఒప్పందం.. నెలకు రూ.10 వేల కోట్లకుపైగా చెల్లించనున్న ఆంత్రోపిక్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్, ఎలాన్ మస్క్‌కు చెందిన xAIతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌లో భాగంగా xAI నిర్వహిస్తున్న డేటా సెంటర్ నుంచి 300 మెగావాట్ల కంప్యూటింగ్ పవర్‌ను ఆంత్రోపిక్ కొనుగోలు చేయనుంది. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెమ్ఫిస్ సమీపంలో ఉన్న Colossus 1 డేటా సెంటర్ పూర్తి సామర్థ్యాన్ని ఈ ఒప్పందం కవర్ చేస్తోంది. ఈ డీల్ కోసం ఆంత్రోపిక్ సంస్థ 2029 మే వరకు ప్రతి నెలా సుమారు 1.25 బిలియన్ డాలర్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ద్వారా xAIకు మొత్తం ఆదాయం 40 బిలియన్ డాలర్లకుపైగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
వివరాలు
ఒప్పందాన్ని రద్దుకు 90 రోజుల ముందుగా నోటీసు
ప్రారంభ రెండు నెలల్లో మాత్రం తక్కువ ధరకు సేవలు అందించనున్నట్లు ఒప్పందంలో పేర్కొన్నారు. ఆంత్రోపిక్ అవసరాలకు అనుగుణంగా xAI తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సడలింపు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ కంప్యూటింగ్ సామర్థ్య ఒప్పందానికి సంబంధించిన వివరాలు స్పేస్-X సంస్థ అమెరికా SECకు సమర్పించిన S-1 ఫైలింగ్‌లో బయటపడ్డాయి. తమ వద్ద ఖాళీగా ఉన్న కంప్యూటింగ్ వనరులను ఆదాయంగా మార్చుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని స్పేస్-X తెలిపింది. అలాగే రెండు సంస్థల్లో ఏదైనా ఒకటి 90 రోజుల ముందుగా నోటీసు ఇస్తే ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
వివరాలు
కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఇతర కంపెనీలకు అద్దెకు ఇస్తూ xAI ఆదాయం
ప్రస్తుతం AI రంగంలో "నియోక్లౌడ్" అనే కొత్త ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. సాధారణంగా సంస్థలు తమ అవసరాలకు డేటా సెంటర్లు నిర్మించుకోవడం లేదా ఇతరులకు క్లౌడ్ సేవలు అందించడం చేస్తుంటాయి. కానీ xAI రెండు పనులను ఒకేసారి చేస్తూ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. తమకు అవసరమైన దానికంటే ఎక్కువగా నిర్మించిన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఇతర కంపెనీలకు అద్దెకు ఇస్తూ ఆదాయం సంపాదిస్తోంది. ఇక xAI రూపొందించిన ప్రముఖ AI అసిస్టెంట్ "గ్రోక్" వినియోగం ఇటీవల తగ్గినట్లు సమాచారం. దీంతో ఖాళీగా ఉన్న సర్వర్ సామర్థ్యాన్ని ఆంత్రోపిక్ వంటి సంస్థలకు విక్రయిస్తూ xAI ఆదాయం పొందే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.