Wind Power Generator: రూ.50 వేల గాలి మరతో ఇంటికి 25 ఏళ్ల పాటు ఉచితంగా కరెంట్..
ఈ వార్తాకథనం ఏంటి
కరెంట్ బిల్లుల భారం సామాన్యులను ఇబ్బంది పెడుతోంది. ఇక పొలాలకు నీళ్లు అందించాలంటే రైతులకు విద్యుత్ సమస్యలు తప్పడం లేదు. ఈ కష్టాలకు పరిష్కారం చూపించేలా ఓ సామాన్యుడు చేసిన ఆవిష్కరణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలాంటి గ్రిడ్ కరెంట్ అవసరం లేకుండా కేవలం గాలి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ.. ఏకంగా వెయ్యి అడుగుల లోతులో ఉన్న బోర్ల నుంచి నీటిని తోడేలా ఓ యంత్రాన్ని రూపొందించారు. పొలాల్లోనే కాకుండా ఇళ్లలోనూ విద్యుత్ అవసరాలను తీర్చేలా దీనిని అభివృద్ధి చేశారు. కేవలం తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న ఓ టీవీ మెకానిక్ 15 ఏళ్ల పాటు శ్రమించి ఈ అరుదైన ఆవిష్కరణను అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
వివరాలు
2024లో 'సైదా విండ్ పవర్ సొల్యూషన్స్' పేరుతో సొంత సంస్థ ఏర్పాటు
ఆయన పేరు పఠాన్ సైదా. వయసు 57 ఏళ్లు. వృత్తిరీత్యా టీవీ మెకానిక్. గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనతో 2010లో ప్రయోగాలు ప్రారంభించారు.
ఇందుకోసం సొంతంగా సుమారు రూ.30 లక్షలు ఖర్చు చేశారు. మొత్తం 15 రకాల ప్రాజెక్టులను రూపొందించి పరీక్షించారు.
చివరకు 15 ఏళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత విండ్ పవర్ యంత్రాల డిజైన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ క్రమంలో 2024లో 'సైదా విండ్ పవర్ సొల్యూషన్స్' పేరుతో సొంత సంస్థను ఏర్పాటు చేశారు.
సుమారు మూడు నెలల క్రితం ఈ విండ్ పవర్ యంత్రాల ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించారు.
వివరాలు
నిరంతరం నీటిని తోడుకునే అవకాశం..
వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలకు యంత్రం పరిష్కారం చూపుతుందని సైదా తెలిపారు.
పొలంలో గాలి మరను ఏర్పాటు చేసుకుంటే గ్రిడ్ కరెంట్ అవసరం లేకుండానే వెయ్యి అడుగుల లోతులో ఉన్న బోరు నుంచి కూడా నీటిని తోడుకోవచ్చని చెప్పారు.
గంటకు కేవలం ఒక కిలోమీటర్ వేగంతో గాలి వీచినా ఈ యంత్రం పనిచేస్తుందని తెలిపారు.
24 గంటల పాటు నిరంతరాయంగా నీటినితోడుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
బోరు మోటార్‌కు సరిపోయే ఈ గాలి మర ధర రూ.90 వేలు కాగా.. దీనికి అదనంగా 18 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ యంత్రానికి మెయింటెనెన్స్ ఖర్చు ఉండదని, 25 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తుందని సైదా తెలిపారు.
వివరాలు
ఈవీ వాహనాలకు కూడా ఛార్జింగ్ చేసుకునే అవకాశం..
రైతుల అవసరాలకే పరిమితం కాకుండా.. గృహ వినియోగానికి కూడా వేర్వేరు సామర్థ్యాల్లో ఈ గాలి మరలను సైదా రూపొందించారు.
ఇంటిపై వీటిని ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
1 కేవీ సామర్థ్యం కలిగిన యంత్రం ధర రూ.50 వేలు. దీనితో ఇంట్లో నాలుగు లైట్లు, నాలుగు ఫ్యాన్లు, ఒక టీవీని నడిపించుకోవచ్చు.
అదే 2 కేవీ సామర్థ్యం కలిగిన యంత్రం ధర రూ.1.10 లక్షలు. దీని ద్వారా కూలర్, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి పరికరాలను వినియోగించడంతో పాటు ఈవీ వాహనాలను కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
3 కేవీ సామర్థ్యం కలిగిన యంత్రాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ధర రూ.1.80 లక్షలుగా ఉంది.