
Rapture: సెప్టెంబర్ 23న భూమి అంతమైపోతుందా? సోషల్ మీడియాలో కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో ఒక వింత వాదన చక్కర్లు కొడుతోంది. ఈ నెల 23వ తేదీ (మంగళవారం) నాటికి భూమి అంతం అవుతుందని ఒక "ప్రళయ సిద్ధాంతం" వైరల్ అవుతోంది. దీనిని నమ్మిన కొంతమంది తమ ఇళ్లు,వాహనాలు అమ్మేసి,ఉద్యోగాలు వదిలి,ఆస్తిపాస్తులను పంచేసి కొత్త జీవితం కోసం సిద్ధమవుతున్నారు. ఈ వాదనకు మూలం దక్షిణాఫ్రికాకు చెందిన పాస్టర్ జోషువా మ్లకెలా. ఆయన ప్రకారం సెప్టెంబర్ 23, 24 తేదీల్లో "రాప్చర్" అనే దైవీయ సంఘటన జరుగనుంది. ఇందులో దేవుడు క్రైస్తవులను పరలోకానికి తీసుకెళ్తాడని,మరణించినవారితో పాటు జీవించి ఉన్నవారు కూడా గాల్లోకి లేచి దేవుని కలుస్తారని చెప్పారు. దేవుని నమ్మని వారు మాత్రం భూమిపైనే మిగిలి బాధలు అనుభవించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
వివరాలు
యూదుల నూతన సంవత్సరం "రోష్ హషన"
ఇదే సమయానికి యూదుల నూతన సంవత్సరం "రోష్ హషన" కూడా జరగడం ప్రత్యేకతగా చెబుతున్నారు. సెంట్విన్జ్ టీవీ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ మ్లకెలా, "రాప్చర్ అంత శక్తివంతంగా జరుగుతుంది, భూమి కంపించిపోతుంది. సిద్ధమై ఉన్నా లేకపోయినా అది వస్తుంది" అని అన్నారు. తాను కలలో యేసు సింహాసనం మీద కూర్చుని, "నేను త్వరలో వస్తాను" అని చెప్పిన దృశ్యం చూశానని వెల్లడించారు. ఈ ప్రవచనం కారణంగానే చాలామంది తమ ఆస్తులను అమ్మేసి, "పరలోక యాత్ర" కోసం సిద్ధమవుతున్నారని సమాచారం.
వివరాలు
సెప్టెంబర్ తర్వాత దాని అవసరం లేదు..
సోషల్ మీడియాలో ఈ కథనం వైరల్ అయ్యింది. కొందరు తమ సిద్ధాంతాలను, సన్నాహకాలను పంచుకుంటూ చర్చించుకుంటున్నారు. హాస్యనటుడు కెవిన్ ఫ్రెడ్రిక్స్, "కొందరు కార్లు, బట్టలు అమ్మేస్తున్నారు. ఇంకొందరు 'రాప్చర్ తర్వాత' భూమిపైన మిగిలిపోయే వాళ్ల కోసం ప్రత్యేక కిట్లు తయారు చేస్తున్నారు" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక టిలాహున్ డెసలెగన్ అనే వ్యక్తి వీడియోలో మాట్లాడుతూ, తన ఐదు సంవత్సరాల కారు అమ్మేసానని, "సెప్టెంబర్ తర్వాత దాని అవసరం లేదు. నేను పరలోకానికి వెళ్తున్నాను" అని పేర్కొన్నాడు. అయితే రాప్చర్ సమయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రెడ్రిక్స్ మాట్లాడుతూ, "భూమి మీద 24 టైమ్‌జోన్లు ఉన్నాయి, అర్థగంట తేడాతో లెక్కిస్తే 38. అయితే రాప్చర్ ఏ సమయానికి వస్తుంది?" అని ప్రశ్నించారు.
వివరాలు
నిజంగా రాప్చర్ జరుగుతుందా?
కలలో తాను చూసిన దృశ్యంలో, దేవుడిని నమ్మని వారిని వెంబడించి మింగేస్తున్న భయంకరమైన ప్రాణులు కనిపించాయని మ్లకెలా అన్నారు. కానీ ఆయన చెప్పేది కలలు, భావోద్వేగాల వరకే పరిమితం అవుతుందని విమర్శకులు అంటున్నారు. రాప్చర్ అనే భావనను అన్ని క్రైస్తవ వర్గాలు అంగీకరించవు. బైబిల్‌లోని కొన్ని శ్లోకాల ఆధారంగా మాత్రమే దీన్ని అనువదించుకుంటారు కానీ తేదీ, సమయం ఎక్కడా పేర్కొనలేదు. బైబిల్ వచనాల ప్రకారం, ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేరు. పరలోకంలోని దూతలు గానీ, యేసు కుమారుడు గానీ తెలియదు. ఆ సమయం గురించి తెలిసింది ఒక్క తండ్రి దేవుడికే అన్నది బైబిల్ స్పష్టంగా చెబుతోంది.