Loading...
Apple: ఏడాది తర్వాత ఎన్‌విడియాను దాటిన ఆపిల్‌.. ప్రపంచంలోనే నంబర్‌వన్ కంపెనీ
ఏడాది తర్వాత ఎన్‌విడియాను దాటిన ఆపిల్‌.. ప్రపంచంలోనే నంబర్‌వన్ కంపెనీ

Apple: ఏడాది తర్వాత ఎన్‌విడియాను దాటిన ఆపిల్‌.. ప్రపంచంలోనే నంబర్‌వన్ కంపెనీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2026
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఆపిల్‌ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారీ పెట్టుబడులు పెట్టకుండా కూడా,చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్‌విడియాను వెనక్కి నెట్టి మార్కెట్‌ విలువలో తొలి స్థానానికి చేరుకుంది. ఇటీవల ఏఐ రంగం జోరుతో దూసుకెళ్లిన ఎన్‌విడియా షేర్లు సోమవారం ఏకంగా 5శాతం మేర పడిపోవడంతో కంపెనీ మార్కెట్‌ విలువ 4.77లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.456 లక్షల కోట్లు) తగ్గింది. అదే సమయంలో ఆపిల్‌ షేర్లు లాభపడటంతో సంస్థ మార్కెట్‌ విలువ 4.95లక్షల కోట్ల డాలర్లకు (దాదాపు రూ.475 లక్షల కోట్లు)పెరిగి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.

వివరాలు 

ఈ నెల 17న అగ్రస్థానాకి ఆపిల్.. కాసేపటికే రెండో స్థానానికి 

ఈ నెల 17న కూడా ఆపిల్‌ కొద్దిసేపు ఎన్‌విడియాను అధిగమించినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ రెండో స్థానానికి చేరింది. తాజాగా మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.

గత ఏడాది కాలంగా ఎన్‌విడియానే ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా కొనసాగింది.

కృత్రిమ మేధ నమూనాల అభివృద్ధికి అవసరమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPUలు)పై ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ భారీగా పెరగడంతో సంస్థ షేర్లు గణనీయంగా లాభపడ్డాయి.

ఈ క్రమంలోనే 2025 అక్టోబరులో 5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువను దాటిన తొలి కంపెనీగా ఎన్‌విడియా చరిత్ర సృష్టించింది.

వివరాలు 

ఇన్వెస్టర్లు ఆందోళన

అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. ఏఐ మౌలిక వసతుల కోసం భారీగా ఖర్చు చేస్తున్న సంస్థలకు అందుతున్న లాభాలపై పెట్టుబడిదారుల్లో సందేహాలు పెరుగుతున్నాయి.

దీంతో ఎన్‌విడియా షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. అమెరికాలోని ఒహాయోలో నిర్మించనున్న ఓపెన్‌ఏఐ డేటా సెంటర్‌ ప్రాజెక్టుకు 250 బిలియన్ డాలర్ల ఆర్థిక హామీ ఇవ్వడంపై ఎన్‌విడియా చర్చలు జరుపుతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

ఏఐ విస్తరణ కోసం అవసరమయ్యే భారీ పెట్టుబడులు భవిష్యత్‌లో సంస్థలపై ఆర్థిక భారాన్ని పెంచే అవకాశముందని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

డేటా సెంటర్లు, ఏఐ మౌలిక వసతులపై మూలధన వ్యయాల నియంత్రణ 

ఇక ఆపిల్‌ విషయానికి వస్తే, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, మెటా వంటి ఇతర బిగ్‌టెక్ కంపెనీలతో పోలిస్తే గత మూడు త్రైమాసికాలుగా డేటా సెంటర్లు, ఏఐ మౌలిక వసతులపై మూలధన వ్యయాలను నియంత్రించింది.

ప్రారంభంలో ఈ వ్యూహంపై విమర్శలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం అదే నిర్ణయం కంపెనీకి అనుకూలంగా మారింది.

మార్కెట్‌ విలువ పెరగడంతో ఆపిల్‌ మరోసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా తన స్థానాన్ని తిరిగి దక్కించుకుంది.

ADVERTISEMENT