Apple Fitness+: ఆపిల్ ఫిట్‌నెస్+ డిసెంబర్ 15న భారత్ లో విడుదల.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థ అయిన ఆపిల్, తన హెల్త్ అండ్ వెల్నెస్ సబ్‌స్క్రిప్షన్ సేవ ఆపిల్ ఫిట్‌నెస్+ ను భారత్‌లో ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ట్రైనర్ మార్గనిర్దేశంలో వర్కౌట్ వీడియోలు, రియల్‌టైమ్ డేటా ట్రాకింగ్ ఫీచర్లు, ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకున్నప్పుడు ఇచ్చే రివార్డుల ద్వారా వినియోగదారులు ఆరోగ్యంగా ఉండేలా ఈ సేవ సహాయపడనుంది. ప్రస్తుతం ఈ ఫిట్‌నెస్+ సేవ ప్రపంచవ్యాప్తంగా 49 దేశాల్లో అందుబాటులో ఉంది. భారత్‌లో ఇది డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. మొదట కేవలం ఆరు దేశాల్లో మాత్రమే ప్రారంభమైన ఈ సర్వీస్, తరువాత 21 దేశాలకు విస్తరించగా, ఇప్పడు మరిన్ని దేశాలకు చేరుకుంది.
వివరాలు
ఆపిల్ ఫిట్‌నెస్+ సబ్‌స్క్రిప్షన్ ధరలు
భారతదేశ మార్కెట్‌కు అనుగుణంగా ఆపిల్ రెండు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. నెలవారీ ప్లాన్ ధర రూ.149 వార్షిక ప్లాన్ ధర రూ.999 ఈ సబ్‌స్క్రిప్షన్‌కు ఫ్యామిలీ షేరింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఒకే ప్లాన్‌తో గరిష్టంగా ఆరు మంది కుటుంబ సభ్యులు సేవను ఉపయోగించుకోవచ్చు.
వివరాలు
3 నెలల ఉచిత ఆఫర్
కొత్తగా ఆపిల్ వాచ్, ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ టీవీ, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 లేదా పవర్‌బీట్స్ ప్రో 2 పరికరాలను కొనుగోలు చేసే వినియోగదారులకు మూడు నెలల పాటు ఆపిల్ ఫిట్‌నెస్+ ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తామని ఆపిల్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలంటే, ఆ పరికరం తాజా ఆపరేటింగ్ సిస్టమ్‌కు మద్దతు ఇవ్వాలి.
వివరాలు
ఫిట్‌నెస్+ ప్రత్యేకతలు
ఆపిల్ ఫిట్‌నెస్+ సేవ మరింత ఆకర్షణీయంగా మారడానికి ఇందులో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, HIIT, పైలేట్స్, డ్యాన్స్, సైక్లింగ్, కిక్‌బాక్సింగ్, ధ్యానం వంటి వాటితో పాటు మొత్తం 12కి పైగా వర్కౌట్ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. వాడుకదారుల అవసరాలకు అనుగుణంగా 5 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వివిధ వ్యవధుల్లో వ్యాయామ వీడియోలను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, వినియోగదారులు ఆపిల్ వాచ్ లేదా ఎయిర్‌పాడ్స్ ప్రో 3ను ఉపయోగిస్తే, వారి హృదయ స్పందన రేటు, ఖర్చయిన క్యాలరీలు, యాక్టివిటీ రింగ్స్ వంటి వివరాలను రియల్‌టైమ్‌లో ట్రాక్ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. దీనివల్ల వ్యాయామ పురోగతిని మరింత సులుభంగా అంచనా వేసుకోవచ్చు.