Memory Chip Shortage: హోటల్ గదుల్లో డీల్స్.. ర్యామ్ సరఫరా కోసం కొరియాకు క్యూ కట్టిన టెక్ కంపెనీలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు మెమరీ చిప్‌ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం,ఆపిల్,డెల్,గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు దక్షిణ కొరియాలో నెలల తరబడి హోటళ్లలోనే తమ ఎగ్జిక్యూటివ్‌లను ఉంచి, నేరుగా సరఫరా ఒప్పందాల కోసం చర్చలు జరుపుతున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ)కారణంగా పెరిగిన డిమాండ్‌తో మెమరీ చిప్‌ల కొరత తీవ్రంగా మారడం, ధరలు అమాంతం పెరగడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం మనం రోజువారీగా వాడే స్మార్ట్‌ఫోన్లు,సర్వర్లు వంటి పరికరాల్లో ఉండే ర్యామ్ (RAM) చుట్టూనే తిరుగుతోంది. పనితీరుకు కీలకమైన ఈ మెమరీ చిప్‌ల ధరలు 2025 మధ్య నుంచి ఏకంగా 300 శాతం వరకు పెరిగాయి.
వివరాలు
హోటళ్లలో కొనుగోలు బృందాలు
ఉదాహరణకు, 12 జీబీ ర్యామ్ మాడ్యూల్‌కి ఆపిల్ ఇప్పుడు సుమారు 70 డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. ఇది 2025 ప్రారంభంతో పోలిస్తే 200 శాతం కంటే ఎక్కువ పెరుగుదల. భవిష్యత్ ఉత్పత్తుల ప్రణాళికలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు పెద్ద టెక్ కంపెనీలు అసాధారణ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆపిల్, శాంసంగ్, ఎస్‌కే హైనిక్స్ ఫ్యాక్టరీల దగ్గర ఉన్న హోటళ్లలో తన కొనుగోలు బృందాలను ఉంచినట్టు సమాచారం. గ్యాంగీ ప్రావిన్స్‌లోని హ్వాసియాంగ్, పాంగ్యో ప్రాంతాల్లో ఉన్న బిజినెస్ హోటళ్లలోనే తిష్ట వేసిన ఈ బృందాలు, వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు మెమరీ చిప్‌ల సరఫరా ఖాయం అయ్యేలా దీర్ఘకాల ఒప్పందాలు కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నాయి.
వివరాలు
కొత్త రకం "సెమీకండక్టర్ టూరిజం"
ఆపిల్ మాత్రమే కాదు. డెల్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు కూడా తమ సీనియర్ అధికారులను ఈ ప్రాంతానికి పంపాయి. దీని వల్ల అక్కడి హోటళ్లకు డిమాండ్ పెరిగింది. కొందరు దీన్ని కొత్త రకం "సెమీకండక్టర్ టూరిజం"గా కూడా వర్ణిస్తున్నారు. అయితే మెమరీ తయారీ సంస్థలు మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. సామ్‌సంగ్, ఎస్‌కే హైనిక్స్ ఇప్పటివరకు త్రైమాసిక ఒప్పందాలకే పరిమితం అవుతున్నాయి. స్థిర ధరలతో దీర్ఘకాల ఒప్పందాలకు ఒప్పుకోవడం లేదు. 2026, 2027 వరకు కూడా మెమరీ ధరలు ఇంకా పెరుగుతాయని వీరి అంచనా. ఇప్పటికే 2025 చివరితో పోలిస్తే 2026 ప్రారంభంలో సర్వర్ మెమరీ ధరలు 60 నుంచి 70 శాతం వరకు ఎక్కువగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
వివరాలు
ఏఐ రంగంలో వచ్చిన విపరీతమైన డిమాండే కొరతకు ప్రధాన కారణం
ఈ కొరతకు ప్రధాన కారణం ఏఐ రంగంలో వచ్చిన విపరీతమైన డిమాండ్. ఏఐ సిస్టమ్‌లకు అవసరమైన హెచ్‌బీఎం3ఈ (HBM3E) అనే ప్రత్యేక మెమరీ తయారీకి ఎక్కువ ఫ్యాక్టరీ సామర్థ్యం వెచ్చిస్తోంది. ఎన్విడియా హెచ్200 వంటి ఏఐ చిప్‌లకు ఒక్కొక్కటికి ఎనిమిది హెచ్‌బీఎం3ఈ యూనిట్లు అవసరం. చైనా సహా పలు దేశాల కంపెనీలు అడ్వాన్స్‌డ్ ఏఐ టెక్నాలజీ దిగుమతులకు అనుమతి రావడంతో బిలియన్ల డాలర్ల ఆర్డర్లు పెట్టాయి. దీంతో సాధారణ ఫోన్లు, ఇతర పరికరాల్లో వాడే ర్యామ్‌కు తక్కువ ఉత్పత్తి మిగులుతోంది. ఫలితంగా మెమరీ ధరలు అంతగా పెరిగాయి కాబట్టి, స్మార్ట్‌ఫోన్ తయారీ ఖర్చుల్లో ర్యామ్ వాటా గతంతో పోలిస్తే ఎక్కువగా మారింది.
వివరాలు
మెమరీ చిప్ కొరత మాత్రం పెద్ద సవాలు
దీని ప్రభావం వినియోగదారులపై కూడా పడే అవకాశం ఉంది. భవిష్యత్ ఐఫోన్ల ధరలు పెరగవచ్చు లేదా ఖర్చు తగ్గించేందుకు కొత్త మోడళ్లలో మెమరీని తగ్గించే అవకాశం ఉంది. ఆపిల్‌కు ఉన్న లాభ మార్జిన్లు,సాఫ్ట్‌వేర్ సామర్థ్యం కొంతవరకు దెబ్బను తట్టుకునేలా చేయొచ్చు. అయినా మెమరీ చిప్ కొరత మాత్రం పెద్ద సవాలుగానే ఉంది. మొత్తానికి, గ్లోబల్ టెక్ సరఫరా వ్యవస్థ ఎంతగా మారిందో ఈ పరిణామాలు చెబుతున్నాయి.
వివరాలు
టెక్ కంపెనీలు,మెమరీ తయారీదారుల మధ్య పోరు
పాత రోజుల్లో నిశ్శబ్దంగా జరిగే డీల్‌లు ఇప్పుడు హోటల్ గదుల్లోనే జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి రేపటి ఏఐ సిస్టమ్‌ల వరకు అన్నిటికీ అవసరమైన చిప్‌ల కోసం టెక్ కంపెనీలు, మెమరీ తయారీదారుల మధ్య పోరు కొనసాగుతోంది. ఈ పరిస్థితి త్వరగా చక్కబడకపోతే, దక్షిణ కొరియా ఫ్యాక్టరీలకే కాదు, మన రోజూ వాడే ఫోన్లు, కంప్యూటర్లలో కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.