Apple: చైనాలో గే డేటింగ్ యాప్స్ తొలగించిన ఆపిల్.. ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఆందోళనలు
ఈ వార్తాకథనం ఏంటి
చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CAC) ఆదేశాల మేరకు, ఆపిల్ సంస్థ చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన గే డేటింగ్ యాప్స్.. Blued, Finka.. ను తన యాప్ స్టోర్ నుంచి తొలగించింది. ఈ నిర్ణయాన్ని ఆపిల్ ప్రతినిధి ధృవీకరిస్తూ, "మేము కార్యకలాపాలు నిర్వహించే ప్రతి దేశంలో స్థానిక చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం" అని తెలిపారు. అయితే, ఈ చర్య చైనాలోని ఎల్జీబీటీ కమ్యూనిటీలో తీవ్ర ఆందోళన కలిగించింది. "ప్రేమ అనేది అరుదైన విషయం, అది సిగ్గుపడే విషయం కాదు. పాలసీలు రూపొందించే హెటెరోసెక్సువల్ నాయకులు దీన్ని అర్థం చేసుకోవాలి" అని కమ్యూనిటీ సభ్యుల్లో ఒకరు స్పందించారు.
యాప్ లభ్యత
ఇంకా కొన్ని యాప్స్ అందుబాటులోనే
Blued, Finka తొలగించినప్పటికీ, Blued Lite వెర్షన్ మాత్రం చైనా యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. అదేవిధంగా Jicco, Jack'd వంటి ఇతర గే, బైసెక్సువల్ డేటింగ్ యాప్స్ ఇంకా చైనాలో యాక్సెస్ చేయవచ్చు. చైనాలో యాపిల్ ప్రత్యేక యాప్ స్టోర్ నడుపుతోంది, ఇది అక్కడి కఠినమైన ఇంటర్నెట్ నియమాలకు అనుగుణంగా ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ చైనాలో నిషేధించబడినందున, ఆండ్రాయిడ్ వినియోగదారులు స్థానిక వెర్షన్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు.
యాప్ పరిమితులు
ఇదే తరహా చర్యలు ఇంతకుముందు కూడా
ఇది తొలిసారి కాదు. 2022లో అమెరికాలో ప్రాచుర్యం పొందిన Grindr యాప్‌ను కూడా యాపిల్ చైనా యాప్ స్టోర్ నుండి తొలగించింది. ఆ సమయంలో CAC "చట్టవిరుద్ధ కంటెంట్"పై కఠిన చర్యలు ప్రారంభించింది. అనంతరం, దేశీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న ప్రతి యాప్ లైసెన్స్ పొందాలనే కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. దీని ఫలితంగా అనేక విదేశీ యాప్స్ చైనాలో నిలిపివేయబడ్డాయి. ఈ పరిమితుల మధ్యే Beijing LGBT Center, ShanghaiPride వంటి ఎల్జీబీటీ మద్దతు సంస్థలు కూడా కార్యకలాపాలు నిలిపివేయాల్సి వచ్చింది.