iPhone: శామ్‌సంగ్‌కు పోటీగా ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్.. ఫీచర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ నుంచి ప్రతిష్టాత్మక ఫోల్డబుల్ ఐఫోన్ కొత్త ఏడాదిలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18 సిరీస్ విడుదల చేసే సమయంలోనే ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా లాంచ్ చేయాలని ఆపిల్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫోన్ డిజైన్, ఫీచర్లు, ధరకు సంబంధించిన పలు గాసిప్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఫోల్డబుల్ ఐఫోన్‌లో 7.76 అంగుళాల భారీ ప్రధాన ఫోల్డబుల్ డిస్ప్లే ఉండనుంది. అదేవిధంగా 5.4 అంగుళాల పరిమాణంలో చిన్న బయటి కవర్ డిస్ప్లేను కూడా అందించనున్నారు.
Details
మినీ ఐప్యాడ్ లా లుక్
ముఖ్యంగా ఈ కవర్ డిస్ప్లే, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ల కంటే కొద్దిగా చిన్నదిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫోన్‌ను పూర్తిగా ఓపెన్ చేసినప్పుడు ఇది ఐప్యాడ్ మినీలా అనిపించేలా డిజైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. డిజైన్ పరంగా చూస్తే, ఈ ఫోల్డబుల్ ఐఫోన్ వెడల్పు సుమారు 83.8 మిల్లీమీటర్లు, ఎత్తు 120.6 మిల్లీమీటర్లు ఉండగా, తెరిచినప్పుడు కేవలం 4.8 మిల్లీమీటర్ల మందంతో అత్యంత సన్నగా కనిపించనుంది. మడిచినప్పుడు మాత్రం దాని మందం సుమారు 9.6 మిల్లీమీటర్ల వరకు పెరుగుతుందని సమాచారం. ఇందులో 1.8 మిల్లీమీటర్ల హింజ్‌ను ఉపయోగించే అవకాశం ఉండగా, సెల్ఫీ కెమెరా కోసం ప్రధాన స్క్రీన్‌పై పంచ్-హోల్ డిజైన్‌ను అందించనున్నారు.
Details
అధికారిక ప్రకటన వెలువడలేదు
అలాగే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ధర, లాంచ్ విషయానికి వస్తే, ఆపిల్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఫోల్డబుల్ ఐఫోన్ ధర సుమారు 1,999 డాలర్లు ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.1.74 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. కంపెనీ సెప్టెంబర్ 2026ను లాంచ్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.