LOADING...
Apple: హ్యాకర్లకు ఆపిల్‌ చెక్‌.. సెక్యూరిటీ అప్‌డేట్లలో కీలక మార్పు
హ్యాకర్లకు ఆపిల్‌ చెక్‌.. సెక్యూరిటీ అప్‌డేట్లలో కీలక మార్పు

Apple: హ్యాకర్లకు ఆపిల్‌ చెక్‌.. సెక్యూరిటీ అప్‌డేట్లలో కీలక మార్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2026
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (ఏఐ) విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్ల దాడుల ముప్పు కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అమెరికా టెక్‌ దిగ్గజం ఆపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల డేటా భద్రతను మరింత బలోపేతం చేయడానికి సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లను ఇకపై ఆలస్యం చేయకుండా ముందుగానే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు భద్రతకు సంబంధించిన చాలా సవరణలను కొత్త ఐఓఎస్‌ వెర్షన్‌తో పాటు ఆపిల్‌ విడుదల చేసేది. కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి రావడానికి ముందు డెవలపర్లు, బీటా వినియోగదారులు విస్తృతంగా పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించేవారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పూర్తి స్థాయి అప్‌డేట్‌ను కంపెనీ విడుదల చేసేది.

వివరాలు 

భద్రతా లోపాలను త్వరగా సరిచేసే లక్ష్యంతో నిర్ణయం

అయితే ఇకపై ఈ విధానంలో మార్పు తీసుకురానుంది. భద్రతకు సంబంధించిన కీలక లోపాలను సరిచేసే అప్‌డేట్లను పెద్ద ఐఓఎస్‌ విడుదల కోసం వేచి ఉండకుండా, వీలైనంత త్వరగా వినియోగదారులకు అందించాలనే నిర్ణయానికి వచ్చింది. దీంతో భద్రతా లోపాలు గుర్తించిన వెంటనే వాటికి పరిష్కారం అందించే అవకాశం పెరుగుతుంది. ఏఐ సాంకేతికతను ఉపయోగించి హ్యాకర్లు కొత్త తరహా దాడి పద్ధతులను అత్యంత వేగంగా రూపొందిస్తున్నారని ఆపిల్‌ పేర్కొంది. అందువల్ల భద్రతా లోపాలను సరిచేసే సమయాన్ని గణనీయంగా తగ్గించడం ఇప్పుడు అత్యవసరమని వెల్లడించింది. ఇటీవల పరిష్కరించిన భద్రతా లోపాలను ఇప్పటివరకు ఎవరూ దుర్వినియోగం చేసినట్లు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని యాపిల్‌ స్పష్టం చేసింది.

Advertisement