Artemis-2: ఆర్టెమిస్-2 : ఉష్ణకవచం కీలక పరీక్షలో ఒరాయన్ సక్సెస్
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రుని చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసుకున్న ఆర్టెమిస్-2 యాత్ర తిరుగు ప్రయాణంలో ఒక కీలక అంశం తీవ్ర ఉత్కంఠ రేపింది. అదే ఒరాయన్ వ్యోమనౌకలో అమర్చిన ఉష్ణకవచం. భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఇది లావాను మించే స్థాయిలోని ఉష్ణాన్ని ఎదుర్కొంది. ఈ తీవ్ర పరిస్థితులను తట్టుకోగలదా అనే అనుమానాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. అయితే అన్ని అంచనాలను తారుమారు చేస్తూ వ్యోమనౌక సురక్షితంగా భూమిపైకి చేరడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాలు
అంతరిక్షం నుంచి గంటకు 38,367 కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి..
పది రోజుల్లో పదకొండు లక్షల కిలోమీటర్ల ప్రయాణం ముగించిన ఒరాయన్‌కు రీఎంట్రీ దశే తుదిపరీక్షగా మారింది. అంతరిక్షం నుంచి గంటకు 38,367 కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. ఇది ధ్వని వేగంతో పోలిస్తే 32 రెట్లు అధికం. ఈ వేగంతో ముందుభాగంలో గాలి తీవ్రమైన ఒత్తిడికి లోనై, సహజ బ్రేక్‌లా పనిచేసి వేగాన్ని తగ్గించింది. అదే సమయంలో ఏర్పడిన రాపిడితో ముందుభాగంపై 2,760 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణం ఉత్పన్నమైంది. ఇది సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రతలో సగానికి సమానం.
వివరాలు
రీ ఎంట్రీ సరైన కోణంలో జరగడం కూడా ఎంతో కీలకం
ఈ విధమైన తీవ్ర ఉష్ణాన్ని తట్టుకోవడానికి వ్యోమనౌకలకు ప్రత్యేక ఉష్ణకవచం అమర్చడం అత్యంత కీలకం. ఇది సరిగా పనిచేయకపోతే వ్యోమనౌక విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. గతంలో ఉష్ణకవచంలో లోపాల కారణంగా 2003 ఫిబ్రవరి 1న కొలంబియా వ్యోమనౌక రీ ఎంట్రీ సమయంలో విచ్ఛిన్నమై, భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా సహా ఏడుగురు మరణించిన ఘటన తెలిసిందే. రీ ఎంట్రీ సరైన కోణంలో జరగడం కూడా ఎంతో కీలకం. మరీ నిటారుగా లేదా చాలా పలుచని కోణంలో ప్రవేశిస్తే ప్రమాదం తప్పదు. అందుకే రీ ఎంట్రీకి ముందు రాకెట్ల సహాయంతో వ్యోమనౌక మార్గాన్ని సరిచేస్తారు.
వివరాలు
ఎబ్లేటివ్ కవచం
ఒరాయన్ వ్యోమనౌక ప్రత్యేకమైన ఆకృతిలో రూపొందించారు. దీని దిగువ భాగంలో అవ్‌కోట్ పదార్థంతో తయారైన ఉష్ణకవచం అమర్చారు. దీని వెడల్పు 16.5 అడుగులు. ఇందులో ప్రధానంగా సిలికా ఫైబర్లు ఉంటాయి. ఈ కవచం ప్రత్యేకత ఏమిటంటే ఇది తీవ్ర ఉష్ణాన్ని ఎదుర్కొంటూ నియంత్రితంగా తానే కాలిపోతుంది. ఇలా కాలిపోతూ వేడిని తనతో తీసుకెళ్లి వ్యోమనౌకను రక్షిస్తుంది.
వివరాలు
తొలి పరీక్షలో బయటపడ్డ లోపాలు
2022 డిసెంబరులో నిర్వహించిన ఆర్టెమిస్-1 యాత్రలో మానవరహిత ఒరాయన్‌పై పరీక్షలు చేశారు. అప్పట్లో ఉష్ణకవచం అనుకున్నదానికంటే ఎక్కువగా కాలిపోయింది. పెద్ద మొత్తంలో కవచ భాగాలు ఊడిపోయినట్లు ఇంజినీర్లు గుర్తించారు. ఇది అసాధారణ పరిణామం. అయినప్పటికీ వ్యోమనౌకలోని సెన్సర్లు లోపల, వెలుపల ఎటువంటి అసాధారణ ఉష్ణాన్ని గుర్తించలేదు. అందువల్ల కవచం తన పని సక్రమంగా నిర్వహించిందని భావించారు.
వివరాలు
లోపాల అసలు కారణం
ఆర్టెమిస్-1లో గుర్తించిన సమస్యలపై శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధించారు. ఉష్ణకవచంలో ఉన్న సూక్ష్మ రంధ్రాల్లో వేడి వాయువులు చిక్కుకుపోవడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయని తేల్చారు. ఈ వాయువులు బయటకు రాకపోవడంతో కవచం పగుళ్లు ఏర్పడి కొన్ని భాగాలు ఊడిపోయాయి. ఇలాంటి పరిస్థితులకు ప్రధాన కారణంగా 'స్కిప్ ఎంట్రీ' విధానాన్ని గుర్తించారు. ఈ విధానంలో వ్యోమనౌక మొదట వాతావరణంలోకి ప్రవేశించి వేగం తగ్గించుకుని, మళ్లీ పైకి వెళ్లి తర్వాత మరోసారి ప్రవేశిస్తుంది. ఇలా చేయడం వల్ల దిగే స్థలానికి దగ్గరగా నియంత్రణ సాధ్యమవుతుంది. అయితే ఈ ప్రక్రియలో కవచంపై అధిక ఉష్ణం, వాయు పీడనం పడినట్లు గుర్తించారు. ఫలితంగా వందకు పైగా పగుళ్లు ఏర్పడ్డాయి.
వివరాలు
మార్గం మారిస్తే పరిష్కారం
ఈ పరిశీలనల తరువాత ఉష్ణకవచాన్ని మార్చాలా అనే ఆలోచనలో శాస్త్రవేత్తలు కొంతకాలం సందిగ్ధంలో పడ్డారు. కానీ కవచాన్ని పూర్తిగా మార్చితే ఆర్టెమిస్-2 యాత్ర మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో పాత కవచాన్నే కొనసాగించాలని నిర్ణయించారు. అదే సమయంలో రీ ఎంట్రీ కోణాన్ని మార్చడం ద్వారా ఉష్ణ ఒత్తిడిని తగ్గించాలని నిర్ణయించారు. ఈ మార్గంలోనూ స్కిప్ విధానాన్ని ఉపయోగించినప్పటికీ, అది తక్కువ సమయంలోనే ముగిసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వ్యూహం విజయవంతమై, ఉష్ణకవచం సమర్థంగా పనిచేసింది. దీంతో ఆర్టెమిస్-2 యాత్ర విజయవంతంగా ముగిసింది.