Super Earth: భూమిని పోలిన మరో 'సూపర్ ఎర్త్'.. గత అంచనాల కంటే నివాసయోగ్యంగా ఉండే అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
భూమికి కేవలం 25 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ రాతి గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు మరోసారి పరిశీలించారు. తాజా అధ్యయనం ప్రకారం, ఈ గ్రహం గతంలో భావించిన దానికంటే భూమిని మరింత పోలి ఉండటమే కాకుండా, జీవం మనుగడకు అనుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉందని వెల్లడించారు. ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, GJ 3378b పేరుతో గుర్తించిన ఈ బాహ్య గ్రహం (ఎక్స్‌ప్లానెట్) భూమికి 7.7 పార్సెక్‌లు (సుమారు 25 కాంతి సంవత్సరాలు) దూరంలో ఉన్న కామెలోపార్డాలిస్ నక్షత్ర మండలంలోని చిన్న, చల్లని M4V రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది.
వివరాలు
జీవం ఉండే ప్రాంతాల కోసం అన్వేషణ..
ఈ గ్రహాన్ని తొలిసారిగా 2024లో గుర్తించారు. అయితే, ఇప్పుడు మెక్‌డొనాల్డ్ అబ్జర్వేటరీలోని హాబిటబుల్-జోన్ ప్లానెట్ ఫైండర్ (HPF), అలాగే కిట్ పీక్లోని NEID స్పెక్ట్రోమీటర్ ద్వారా సేకరించిన కొత్త రేడియల్-వెలాసిటీ పరిశీలనల ఆధారంగా దీని లక్షణాలను శాస్త్రవేత్తలు మళ్లీ అంచనా వేశారు. ఈ అధ్యయనానికి ప్రధాన రచయిత, కాలిఫోర్నియా యూనివర్సిటీ-ఇర్విన్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త పాల్ రాబర్ట్‌సన్ మాట్లాడుతూ, "మా ప్రధాన లక్ష్యం నీటి ఆనవాళ్లను వెతకడమే. ఎందుకంటే భూమిపై తెలిసిన ప్రతి జీవికి నీరు అత్యవసరం. అందుకే జీవం ఉండే అవకాశమున్న ప్రాంతాల కోసం అన్వేషణలో ముందుగా నీటి అవకాశాలనే పరిశీలిస్తాం" అని తెలిపారు.
వివరాలు
రెడ్ డ్వార్ఫ్ నక్షత్రాలపై ఫోకస్..
పరిశోధన వివరాల ప్రకారం, రెడ్ డ్వార్ఫ్ నక్షత్రాలు విశ్వంలో అత్యంత చల్లగా ఉండే నక్షత్రాల వర్గానికి చెందినవి. ఇవి మన సూర్యుడి కంటే పరిమాణంలో చిన్నవిగా, ప్రకాశంలో తక్కువగా ఉంటాయి. ఎర్రటి రంగులో కనిపించే ఈ నక్షత్రాలు మన గెలాక్సీలో అత్యధికంగా ఉండటంతో, సౌర కుటుంబం వెలుపల జీవం కోసం జరిగే పరిశోధనల్లో వీటికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పరిశోధనలో సహ రచయిత, టెక్సాస్ యూనివర్సిటీ-ఆస్టిన్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త మైకేల్ ఎండ్ల్ మాట్లాడుతూ, "మన గెలాక్సీలోని నక్షత్రాల్లో సుమారు 70 శాతం రెడ్ డ్వార్ఫ్‌లే. అందువల్ల ఇవే సాధారణ నక్షత్రాలుగా చెప్పవచ్చు. కాబట్టి ఈ నక్షత్రాల చుట్టూ ఉండే గ్రహాల గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం" అని అన్నారు.
వివరాలు
2024లో తొలిసారి గుర్తింపు..
మైకేల్ ఎండ్ల్ మాట్లాడుతూ, "ఈ పరిశోధనలో అత్యంత కీలకమైన అంశం ఖచ్చితత్వం. తక్కువ ద్రవ్యరాశి కలిగిన గ్రహాలను గుర్తించాలంటే చాలా స్వల్ప సంకేతాలను కూడా పట్టుకోవాలి. ఇందుకు అత్యంత కచ్చితమైన పరికరాలు అవసరం. అవి లేకపోతే ఇలాంటి గ్రహాలను గుర్తించడం సాధ్యం కాదు" అని చెప్పారు. 2024లో ఈ గ్రహాన్ని తొలిసారి గుర్తించినప్పుడు, ఇది భూమి కంటే సుమారు 5 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉందని భావించారు. అయితే తాజా విశ్లేషణలో దీని కనిష్ఠ ద్రవ్యరాశి భూమి కంటే సుమారు 5.3 రెట్ల నుంచి 2.3 రెట్లకు తగ్గినట్లు వెల్లడైంది. గ్రహం నక్షత్రం చుట్టూ ఒకసారి పరిభ్రమించేందుకు పట్టే సమయం కూడా 24.7 రోజుల నుంచి సుమారు 21 రోజులకు సవరించారు.
వివరాలు
అలాంటి గ్రహాలపై పరిశోధనలు..
ఈ కొత్త అంచనాల ప్రకారం GJ 3378b 'సూపర్ ఎర్త్' వర్గానికి చెందిన గ్రహంగా నిర్ధారణ అయింది. అంటే ఇది భూమి కంటే ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉన్నప్పటికీ, ప్రధానంగా రాతితో ఏర్పడిన గ్రహంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చివరగా మైకేల్ ఎండ్ల్ మాట్లాడుతూ, "జీవం ఉనికిని సూచించే బయోసిగ్నేచర్లను గుర్తించడమే మా అంతిమ లక్ష్యం. ప్రస్తుతం మన సౌర పరిసరాల్లోని సమీప నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాలను గుర్తించే దశలో ఉన్నాం. అలాగే మన సమీప గ్రహాల్లో ఏవి జీవానికి అనుకూలంగా ఉండే అవకాశముందో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది" అని తెలిపారు.