Beaver Moon 2025: నవంబర్ 5న అతి దగ్గరగా కనిపించే సూపర్‌మూన్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ బుధవారం రాత్రి జరగబోయే సూపర్‌మూన్ సమయంలో చంద్రుడు సాధారణం కంటే కొంచెం పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనబడనున్నాడు. నవంబర్ 5న ఈ సూపర్‌మూన్ ఆకాశాన్ని అలరించబోతోంది. చంద్రుడు తన కక్ష్యలో భూమికి అత్యంత సమీప దూరంలో ఉన్నప్పుడు, అదే సమయంలో పౌర్ణమి జరగడంతో ఈ సూపర్‌మూన్ ఏర్పడుతుంది. నాసా ప్రకారం, ఈ సమయంలో చంద్రుడు సంవత్సరంలో కనిపించే అత్యంత మసక చంద్రుడి కంటే సుమారు 14 శాతం పెద్దదిగా, 30 శాతం ఎక్కువ కాంతివంతంగా కనిపిస్తాడు. ఈ సంవత్సరం సంభవించే మూడు సూపర్‌మూన్‌లలో ఇది రెండవది. నవంబర్‌లో కనబడే ఈ చంద్రుడు కూడా భూమికి చాలా సమీపంగా ఉండనున్నాడు.
వివరాలు
డిసెంబర్‌లో మరొక సూపర్‌మూన్
చంద్రుడు భూమికి సుమారు 2,22,000 మైళ్ల (అంటే 3,57,000 కిలోమీటర్ల)దూరం వరకూ చేరుతాడు. లోవెల్ అబ్జర్వేటరీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త లారెన్స్ వాస్సర్‌మాన్ చెప్పినట్లు,చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సముద్ర అలల్లో కొద్దిపాటి పెరుగుదల గమనించవచ్చు. అయితే ఈ మార్పులు ఎక్కువగా గమనించదగినవి కావు. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ అబ్రమ్స్ ప్లానిటోరియం డైరెక్టర్ షానన్ ష్మోల్ ప్రకారం,ఆకాశం స్పష్టంగా ఉంటే సూపర్‌మూన్‌ను చూసేందుకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం ఉండవు. సాధారణ కంటి చూపుతోనే ఆ అందాన్ని ఆస్వాదించవచ్చు.సాధారణంగా సూపర్‌మూన్‌లు సంవత్సరంలో కొన్ని సార్లు మాత్రమే చోటుచేసుకుంటాయి. అక్టోబర్‌లో ఒక సూపర్‌మూన్ ఇప్పటికే జరిగింది,అది చంద్రుడిని కొద్దిగా పెద్దగా చూపించింది. డిసెంబర్‌లో మరొక సూపర్‌మూన్ సంభవించనుంది, అది ఈ ఏడాది చివరిది అవుతుంది.