AI: ఏఐ కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్.. లైసెన్స్ లేకుంటే జైలుకే!
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధా (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆవిష్కరణలతో ప్రపంచం వేగంగా కొత్త దిశలో అడుగులు వేస్తోంది. ఒక క్లిక్‌తో వ్యాసాలు రచించడం, చిత్రాలు సృష్టించడం, వాయిస్‌లు తయారు చేయడం, వాయిస్ ఓవర్లు ఇవ్వడం, వీడియోలు ఎడిట్ చేయడం - ఇవన్నీ ఇప్పుడు రోజువారీ సాధారణ అంశాలుగా మారాయి. ఈ సాంకేతిక పరిణామం సమాజానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నప్పటికీ, దానివల్ల తప్పుడు సమాచారానికి కూడా తలుపులు తెరుచుకున్నాయి. ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్ వీడియోల రూపంలో వచ్చే తప్పుడు కంటెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థలను, వ్యక్తుల గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో భారత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల ముఖ్యమైన సిఫార్సులు చేసింది. వాటిలో ప్రధానమైనది.
Details
రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చ
ఏఐ ఆధారిత కంటెంట్ సృష్టించే వారు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి అన్న ప్రతిపాదన. అంటే, కృత్రిమ మేధా ఆధారంగా ఎవరైనా వ్యాసం రాయాలన్నా, వీడియో రూపొందించాలన్నా, ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీని వెనుక ఉద్దేశం స్పష్టంగా ఉంది. సాంకేతికత అభివృద్ధిని ఆపడం కాదు, కానీ దాని దుర్వినియోగాన్ని నివారించడం కోసమని చెప్పొచ్చు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నేతృత్వంలో ఏర్పడిన కమిటీ ఈ నివేదికను సిద్ధం చేసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చ జరిపి బిల్లుగా తీసుకురావాలనే ఆలోచన ఉంది. సమాచార మంత్రిత్వశాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ మాత్రమే కాకుండా, ఇతర సంబంధిత విభాగాల మధ్య సమన్వయం అవసరమని పేర్కొంది.
Details
రోజు రోజుకు తీవ్రతరమవుతున్న డీప్ ఫేక్ సమస్య
ఈ సమన్వయం ఉంటే చర్యలు మరింత సమర్థవంతంగా ఉంటాయని అభిప్రాయపడింది.ఇక డీప్‌ఫేక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇప్పటికే పలువురు నటీమణులు దీని బారిన పడ్డారు. ఇటీవల రష్మికా మందన డీప్‌ఫేక్ వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియోల్లో ఆమెలా కనిపించినా, అది తానుకాదని రష్మిక స్పష్టంచేయడంతో పాటు, సాంకేతికంగా ఎలా మోసపూరితంగా తయారు చేశారో నిపుణులు వివరించారు. ఈ ఘటన తర్వాతే డీప్‌ఫేక్‌ల ప్రమాదం ఎంత ఉందో ప్రజలకు బోధపడింది. నకిలీ వీడియోలు, వాయిస్‌లు, ప్రసంగాలను గుర్తించే రెండు ప్రత్యేక ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రారంభించింది. ఇవి ప్రాథమిక ప్రయత్నాలు మాత్రమేనని, భవిష్యత్తులో సమస్య మరింత పెరగవచ్చని కమిటీ హెచ్చరించింది.
Details
చట్టపరమైన చర్యలు అవసరం
చట్టపరమైన చర్యలు లేకుండా ఈసమస్యను పూర్తిగా పరిష్కరించడం కష్టమని స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వ ఉద్దేశం సానుకూలమైనదే అయినప్పటికీ, లైసెన్స్ విధానం అమల్లోకి వస్తే కొన్ని కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఇది కంటెంట్ సృష్టికర్తలపై అదనపు భారం వేసే అవకాశం ఉంది.సృజనాత్మకత పరిమితుల బంధంలోకి చేరి స్వేచ్ఛ తగ్గిపోతుందనే ఆందోళన సహజం. లైసెన్స్ ప్రక్రియ క్లిష్టంగా ఉంటే చిన్నస్థాయి సృష్టికర్తలు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది.అంతర్జాతీయ ప్రమాణాలు లేకపోవడం వల్ల నియంత్రణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవచ్చనే సందేహం కూడా ఉంది. అయినా సరే, ఈ సమస్యను పూర్తిగా పక్కన పెట్టలేం. కృత్రిమ మేధ ఆధారిత కంటెంట్ భవిష్యత్తు మార్గం. దాన్ని ఆపడం అసాధ్యం, కానీ దాని వినియోగం బాధ్యతాయుతంగా ఉండేలా నియంత్రణలు తప్పనిసరి.